Daakko Daakko Meka: 'దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్దీ పీక'.. ఇక రికార్డులు బద్దలవడం పక్కా! బెబ్బులిలా గాండ్రిస్తున్న లిరిక్స్, అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలోని ఫస్ట్ సింగిల్ విడుదల
Allu Arjun in Pushpa Song Daakko Daakko Meka (Photo Credits: YouTube Still)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ అభిమానులందరి కోసం వేటకూర లాంటి పాట ఒకటి విడుదలైంది. ఈ పాట విన్నా, పాటలో అక్కడక్కడ అల్లు అర్జున్ వైల్డ్ ఎక్స్‌ప్రెషన్స్ చూసినా, అబ్బో మంచి నాటు బిర్యానీ లాంటి విందు భోజనం ఆరగించినంత తృప్తిగా ఉంటుంది.

బన్నీ నటిస్తున్న కొత్త చిత్రం 'పుష్ప- ది రైజ్' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. 'దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్దీ పీక' అంటూ సాగుతున్న ఈ పాట విన్నవారు, రికార్డులు పక్కా అని చెబుతున్నారు.

బన్నీ కెరియర్‌లో మరొక హిట్‌గా నిలిచిన 'అల వైకుంఠపురములో' లాంటి డీసెంట్ ఫ్యామిలీ డ్రామా తర్వాత అల్లు అర్జున్ పూర్తి విరుద్ధమైన జోనర్లో నటిస్తున్నారు. 'పుష్ప' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలీవుడ్ మాస్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య (2004) మరియు ఆర్య 2 (2009) సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు మూడో చిత్రం పుష్ప ఒక ఒక హై-ఓల్టేజ్ మాస్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.

ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ సింగిల్‌లో అల్లు అర్జున్ లుక్స్ మరియు ఎక్స్‌ప్రెషెన్స్ చూపరుల మతులు పోగొడుతుంది. ఇదివరకు ఎప్పుడూ చూడని అవతారంలో స్టైలిష్ స్టార్ పూర్తిగా రఫ్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. మ్యూజిక్ సామ్రాట్ దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఆ పాట ఎలా ఉందో చూడండి.

Dakko Dakko Meka Song From Pushpa:

ఈ సినిమాలో పుష్పరాజ్ అనే పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. చిత్తూరు అడవుల్లో సాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ ఉంటుందని చెబుతున్నారు. ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, అందులో ఒక పాత్ర స్మగ్లర్ అని టాక్.

హీరోయిన్‌‌గా రష్మిక మందనా (Rashmika Mandanna) నటిస్తుండగా, మళయాలీ స్టార్ ఫాహధ్ ఫాసిల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ 5 భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా పుష్ప- పార్ట్1 డిసెంబర్ 2021లో మరియు పుష్ప పార్ట్2, 2022లో విడుదల చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేసింది.