Gold Smuggled Under Wig (photo-Twitter)

Kochi,October 5: కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుందనే సామెత ఈ స్టోరీకి అక్షరాల సరిపోతుంది. తెలివిగా స్మగ్లింగ్ చేద్దామనుకున్న ఓ యువకుడు కాలం కలిసిరాక అడ్డంగా బుక్కైపోయాడు. ఈ ఘటన కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. మలప్పురానికి చెందిన నౌషద్‌ అనే యువకుడు షార్జా నుంచి కొచ్చిన్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. ముందుగా తన తలపై మధ్యభాగంలో వెంట్రుకలను కత్తిరించుకున్నాడు. ఆ భాగంలో బంగారం పెట్టి దానిపై జుట్టు అధికంగా ఉన్న విగ్‎ను కొనుగోలు చేసి ధరించాడు.ఈ నేపథ్యంలో కస్టమ్స్ అధికారుల కళ్ళు కప్పి తప్పించుకోవాలని అనుకున్నాడు. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేస్తుండగా నౌషద్‌ పట్టుబడ్డాడు. విగ్‌లో ఉన్న 1.13 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నౌషద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.