Hyd, Dec 5: తెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఆత్మగౌరవంతో బతకాలన్నది ప్రతి ఒక్కరి కల. అందుకే ఇదొక పండుగ సందర్భం. ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటిముందు వెలుగుల్లో పండుగ చేసుకునే సందర్భమిది... అని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యం ఎంత గొప్పదైనప్పటికీ అమలులో లోపాలుంటే ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతింటుంది. పేదవారికి అన్యాయం జరుగుతుంది. అందుకే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ఏ ఒక్క ఇళ్లు కూడా అనర్హులకు చెందకూడదని ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తెచ్చామని ఈ సందర్భంగా సీఎం వివరించారు.
ఇందిరమ్మ ఇండ్లను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తాం. అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కింద ఇండ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్... ఈ క్రమంలో ప్రాధాన్యత ఇస్తూ ఇండ్లను కేటాయిస్తాం అన్నారు. ఉన్న స్థలాన్ని గరిష్టస్థాయిలో వినియోగించుకుని నిర్మించుకునేలా లబ్దిదారుల కోసం ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటిని నిర్మించి చూపిస్తాం. అచ్చం అలాగే కట్టాలని కాకుండా అవగాహన కోసం మాడల్ హౌజ్‌ను చూపిస్తాం అన్నారు.
తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్ల కేటాయింపులో భాగంగా మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇచ్చాం అన్నారు. ఆదివాసీలు, ఆదివాసీ తండాలు (ఐటీడీఏ తండాలకు) జనాభా ప్రాతిపదికన ప్రత్యేకంగా పరిశీలించి అదనంగా కొన్ని వేల ఇండ్లను నిర్మిస్తాం. ఇప్పుడు కేటాయించిన ఇండ్లు కాకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోటా ఇస్తామన్నారు. తెలంగాణ హైకోర్టులో హరీశ్ రావుకు ఊరట, ఆయన్ని అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు.. కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్‌కు నోటీసులు
గతంలో రుణాలు తీసుకుని ఇండ్లు కట్టుకున్న 7 వేల కుటుంబాల రుణాలను కూడా ప్రభుత్వం తీర్చి వారిని రుణ విముక్తులను చేస్తుందన్నారు. పెరిగిన ధరలు, పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి ఇండ్లు కట్టుకోవడానికి ప్రతి పేద వాడికి 5 లక్షల రూపాయలిచ్చి ఇండ్లు కట్టుకోవడానికి ప్రోత్సహిస్తుంది...2004 నుంచి 2014 వరకు 25.04 లక్షల పేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగింది. 2014-2013 కాలంలో 1. 52 లక్షలు డబుల్ బెడ్రూమ్ ల నిర్మాణం చేపడితే వాటిల్లో 60 నుంచి 65 వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేయగా, అర్థాంతరంగా వదిలేసిన మిగిలిన ఇండ్లను పూర్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం 195 కోట్లను కేటాయించిందన్నారు. పేదలకు వెసులుబాటు కల్పిస్తూ విధివిధానాలను నిర్ణయించాం... అదనంగా ఒక గది కట్టుకుంటామంటే అందుకు వెసులుబాటు కల్పించాం అన్నారు.