Guillain-Barré Syndrome: నరాల మీద దాడి చేస్తున్న కొత్త వ్యాధి జీబీఎస్, ఒక్కో ఇంజెక్షన్ ధర వేల రూపాయల పైమాటే, గిలియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి
మహారాష్ట్రలో గిలియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారీనపడి బాధితుడు ఒకరు చనిపోయారు. మృతికి గల కారణంపై ఇంకా స్పష్టత రానప్పటికీ వైద్యులు మాత్రం జీబీఎస్ కారణంగానే మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు.
Mumbai, Jan 27: మహారాష్ట్రలో గిలియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారీనపడి బాధితుడు ఒకరు చనిపోయారు. మృతికి గల కారణంపై ఇంకా స్పష్టత రానప్పటికీ వైద్యులు మాత్రం జీబీఎస్ కారణంగానే మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో జీబీఎస్ బాధితుల సంఖ్య 101కి చేరింది. వీరిలో 16 మందికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఈ జీబీఎస్ కు సంబంధించి వైద్యులు పలు కీలక విషయాలను వెల్లడించారు. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారికి జీబీఎస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. సాధారణంగా శరీరంలోకి ప్రవేశించిన ఇన్ఫెక్షన్ కారక క్రిములతో రోగనిరోధక వ్యవస్థ పోరాడుతుంది. అయితే, జీబీఎస్ లో మాత్రం హానికారక క్రిములకు బదులు నరాలపై దాడి చేస్తుందని, ఇది చాలా అరుదుగా జరుగుతుందని తెలిపారు. జీబీఎస్ బారిన పడినవారిలో తిమ్మిర్లు, కండరాలు బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు.
మహారాష్ట్రను వణికిస్తున్న కొత్త వ్యాధి, ఇప్పటికే ఒకరు మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 73 మంది
జీబీఎస్ కేసులకు కలుషిత ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కాంపిలో బ్యాక్టర్ జెజునీ బ్యాక్టీరియా కారణమని వైద్యనిపుణులు అనుమానిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ విషయంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ చేసే పొరపాటే జీబీఎస్ కు దారితీస్తుందని, ప్రతీ వెయ్యి మందిలో కేవలం ఒకరికి మాత్రమే ఈ పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు. ఈ సిండ్రోమ్ బాధితులలో డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు.
అయితే జీబీఎస్ అంటువ్యాధి కాదని, ఒకరి నుంచి మరొకరికి సోకదని వైద్యులు స్పష్టం చేశారు. జీబీఎస్ బాధితులకు సరైన చికిత్స అందిస్తే కోలుకుంటారని ధైర్యం చెప్పారు. సుమారు 80 శాతం మంది బాధితులు చికిత్స తర్వాత ఆరు నెలల్లో పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. కొందరిలో మాత్రం ఏడాది వరకూ ప్రభావం కనిపిస్తుందని చెప్పారు. అయితే, దీని చికిత్స చాలా ఖరీదైందని అధికారులు తెలిపారు. చికిత్సలో భాగంగా రోగికి ఇచ్చే ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ ధర ఒక్కొక్కటి వేలల్లో ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జీబీఎస్ బాధితులకు ఉచిత వైద్యం అందిస్తామని మహారాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్ వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Jan 27, 2025 10:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

