Actor Nagabhushana: కన్నడ నటుడి ర్యాష్ డ్రైవింగ్‌, ఫుట్‌పాత్‌ మీద నడుస్తున్న జంటను ఢీకొట్టడంతో మహిళ మృతి, నటుడు అరెస్ట్, బెయిల్‌పై విడుదల
Actor Nagabhushana (PIC@ X)

Bangalore, OCT 01: కన్నడ యాక్టర్ నాగభూషణ (Actor Nagabhushana) తన ర్యాష్ డ్రైవింగ్ తో (Rash Driving) ఒక మహిళ ప్రాణాలను బలికొన్నాడు. ఈ సంఘటన సెప్టెంబర్ 30 శనివారం రాత్రి బెంగళూరులో చోటు చేసుకుంది. అతివేగంతో కారు నడుపుతూ వస్తున్న నాగభూషణ బెంగళూరులోని కోనకుంటె క్రాస్ సమీపంలో అదుపుతప్పి ఫుట్‌పాత్‌ పై నడుచుకుంటూ వెళ్తున్న ఒక జంట పైకి దూసుకు వెళ్ళాడు. ఈ ప్రమాదంలో 48 ఏళ్ల మహిళ మృతి చెందింది. దీంతో నాగభూషణని (Actor Nagabhushana) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వివరాలు ప్రకారం.. శనివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో నాగభూషణ ఆర్‌ఆర్‌ నగర్‌ లో ఓ కార్యక్రమంలో పాల్గొని జేపీ నగర్‌లోని తన నివాసానికి తిరిగి కారులో వెళ్తున్నాడు. కారు అతివేగంతో ఉండడంతో కోననకుంటె క్రాస్‌ సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఫుట్‌పాత్‌ పై నడుస్తున్న కృష్ణప్ప-ప్రేమ దంపతుల పైకి దూసుకెళ్లింది. ఇక ఆ గాయపడిన దంపతులను.. యాక్సిడెంట్ చేసిన నాగభూషణే దగ్గరుండి ఆటోరిక్షాలో ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

 

అయితే మహిళకు తీవ్ర గాయాలు అవ్వడంతో హాస్పిటల్ కి చేరుకోవడానికి ముందే ఆమె మరణించింది. ఆమె భర్త కృష్ణప్ప (58) ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ విషయం పై ఆ దంపతుల కుమారుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. రాత్రి భోజనం చేసి ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న తన తల్లిదండ్రులను నాగభూషణ కారు ఢీకొట్టిందని పేర్కొన్నాడు. అయితే నాగభూషణ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో.. ఆ దంపతులు అకస్మాత్తుగా ఫుట్‌పాత్ నుండి రహదారిపైకి రావడం వలనే ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చాడు. పోలీసులు అరెస్ట్ చేసిన నాగభూషణ శనివారం అర్థరాత్రి బెయిల్‌పై విడుదలయ్యాడు.