Assembly 'COVID' Session: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడి, సభ్యులు హాజరయ్యేనా?
కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో అన్ని సామూహిక కార్యక్రమాలు వాయిదా పడిన వేళ, తెలంగాణ అసెంబ్లీ సమావేశం అయ్యేందుకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు...
Hyderabad, August 17: కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో అన్ని సామూహిక కార్యక్రమాలు వాయిదా పడిన వేళ, తెలంగాణ అసెంబ్లీ సమావేశం అయ్యేందుకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి పలువురు మంత్రులతో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల ముఖ్యమైన అంశాలపై సమగ్ర చర్చ జరిపే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి, మంత్రులు అభిప్రాయపడ్డారు. కనీసం 15 రోజుల పనిదినాలైనా ఉండాలన్నారు.
వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి మంత్రులను, అధికారులను కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి సిద్ధం కావాలని కోరారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులను సీఎం ఆదేశించారు.
ఏదైమైనా కరోనా సంక్షోభ సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరగడం, సభ్యుల మధ్య భౌతిక దూరం పాటించేలా కొవిడ్ నిబంధనలు ఎలా అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణ కొవిడ్ కేసుల విషయంలో వైద్య, ఆరోగ్య శాఖపై అనేక విమర్శలు ఉన్నాయి, సెక్రెటేరియట్ కూల్చివేత తదితర అంశాలు కూడా హాట్ టాపిక్ గా ఉన్నాయి, ఇలాంటి తరుణంలో ప్రతిపక్షాలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాయా? మరోవైపు ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. మరి ఈ సమావేశాలకు ఎంతమంది సభ్యులు హాజరవుతారు అనేది వేచిచూడాలి.
(The above story first appeared on LatestLY on Aug 17, 2020 09:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

