Pitru Paksha 2026: పితృపక్షం 2026 మొదటి రోజు ఎప్పుడు.. ఎప్పుడు ముగుస్తుంది.. శ్రాద్ధ తేదీలు, నియమాలు తెలుసుకోండి..
హిందూ సంప్రదాయంలో పితృ పక్షానికి అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. తమ పూర్వీకుల పట్ల భక్తి, శ్రద్ధలను ప్రదర్శిస్తూ వారి ఆత్మశాంతికి తర్పణాలు, పిండ ప్రదానాలు ,దానధర్మాలు చేసేందుకు ఉద్దేశించిన 16 రోజుల పవిత్ర కాలమే ఈ పితృ పక్షం.
Pitru Paksha 2026: హిందూ సంప్రదాయంలో పితృ పక్షానికి అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. తమ పూర్వీకుల పట్ల భక్తి, శ్రద్ధలను ప్రదర్శిస్తూ వారి ఆత్మశాంతికి తర్పణాలు, పిండ ప్రదానాలు ,దానధర్మాలు చేసేందుకు ఉద్దేశించిన 16 రోజుల పవిత్ర కాలమే ఈ పితృ పక్షం. ఈ సమయంలో భూమిపైకి వచ్చే పూర్వీకులు తమ సంతానానికి ఆనందం, సౌభాగ్యం ,ఆయురారోగ్యాలను ప్రసాదిస్తారని పౌరాణిక నమ్మకం
తెలుగు క్యాలెండర్ ప్రకారం, 2026 సంవత్సరానికి గాను పితృ పక్షం సెప్టెంబర్ 26, శనివారం నాటి భాద్రపద పౌర్ణమి రోజున ప్రారంభమవుతుంది. ప్రధాన శ్రాద్ధ పక్షం ఆశ్విన మాసపు కృష్ణ పక్ష ప్రతిపద తిథి అయిన సెప్టెంబర్ 27న మొదలై, అక్టోబర్ 10, శనివారం నాటి సర్వ పితృ అమావాస్యతో ముగుస్తుంది. పౌర్ణమి నాడు మరణించిన వారికి సెప్టెంబర్ 26న శ్రాద్ధం నిర్వహిస్తారు. ఇక మరణించిన తిథి తెలియని వారికి లేదా నిర్దిష్ట తిథిలో శ్రాద్ధం జరపలేని వారికి మహాలయ అమావాస్య (అక్టోబర్ 10) అత్యంత శ్రేష్ఠమైన రోజుగా పరిగణిస్తారు.
పితృ పక్ష క్యాలెండర్ 2026
సెప్టెంబర్ 26 (శనివారం): భాద్రపద పౌర్ణమి శ్రాద్ధం
సెప్టెంబర్ 27 (ఆదివారం): ప్రతిపద శ్రాద్ధం
సెప్టెంబర్ 28 (సోమవారం): ద్వితీయ శ్రాద్ధం
సెప్టెంబర్ 29 (మంగళవారం): తృతీయ శ్రాద్ధం
సెప్టెంబర్ 30 (బుధవారం): చతుర్థి శ్రాద్ధం
అక్టోబర్ 1 (గురువారం): పంచమి శ్రాద్ధం
అక్టోబర్ 2 (శుక్రవారం): షష్ఠి శ్రాద్ధం
అక్టోబర్ 3 (శనివారం): సప్తమి ,అష్టమి శ్రాద్ధం
అక్టోబర్ 4 (ఆదివారం): నవమి శ్రాద్ధం (మాతృ నవమి)
అక్టోబర్ 5 (సోమవారం): దశమి శ్రాద్ధం
అక్టోబర్ 6 (మంగళవారం): ఏకాదశి శ్రాద్ధం
అక్టోబర్ 7 (బుధవారం): ద్వాదశి శ్రాద్ధం
అక్టోబర్ 8 (గురువారం): త్రయోదశి శ్రాద్ధం
అక్టోబర్ 9 (శుక్రవారం): చతుర్దశి శ్రాద్ధం
అక్టోబర్ 10 (శనివారం): సర్వ పితృ అమావాస్య శ్రాద్ధం
పితృ పక్షంలో పాటించాల్సిన ముఖ్య నియమాలు
శాస్త్రాల ప్రకారం, ఈ 16 రోజుల కాలంలో పితృదేవతల అనుగ్రహం పొందేందుకు కొన్ని పనులు చేయాలని, మరికొన్నింటిని ఖచ్చితంగా వర్జించాలని పండితులు సూచిస్తున్నారు.
చేయకూడని పనులు (నిషేధాలు):
ఈ సమయంలో జుట్టు, గడ్డం లేదా గోళ్లను కత్తిరించుకోకూడదు. మాంసాహారం, మద్యం ,తామసిక ఆహారాలైన ఉల్లి, వెల్లుల్లి వంటివాటికి దూరంగా ఉండాలి. నూతన వస్త్రాలు, వాహనాలు లేదా ఆస్తుల కొనుగోలు మానుకోవాలి. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, పుట్టువెంట్రుకలు తీసే శుభకార్యక్రమాలు ,ఏవైనా కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టులను ప్రారంభించడం నిషిద్ధం.
చేయాల్సిన పనులు:
ఇంటి గుమ్మం వద్దకు వచ్చే ఆవులు, కుక్కలు, కాకులు ,ఇతర జంతుపక్షులను తోసివేయకుండా వాటికి ఆహారం, నీరు అందించాలి. శాస్త్రోక్తంగా బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం ,వస్త్రదానం చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆశీస్సులతో కుటుంబంలో పేదరికం తొలగి ఆర్థిక శ్రేయస్సు, సంతాన ప్రాప్తి కలుగుతాయని విశ్వసిస్తారు.
(The above story first appeared on LatestLY on Sep 21, 2026 03:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

