Health Tips: వయసు 60 దాటినా యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్నారా.. మెటాబాలిజాన్ని మెరుగుపరచే ఈ చిట్కాలు తప్పక ఫాలో కండి..
వయసు పెరిగేకొద్దీ శరీరంలోని మెటాబాలిజం (Metabolism) సహజంగానే మందగిస్తుంది. దీంతో బరువు పెరగడం, అలసట, కండరాల బలం తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.అయితే అలవాట్లతో మెటాబాలిజాన్ని మెరుగుపరచవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలిలో చిన్న మార్పులు కూడా దీర్ఘకాలంలో మంచి ఫలితాలను అందిస్తాయని వారు చెబుతున్నారు.
Health Tips: వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని జీవక్రియల (మెటబాలిజం) వేగం సహజంగానే తగ్గుతుందని.. దీనివల్ల చిన్నతనంలో తేలికగా జీర్ణమైన ఆహారం కూడా ఆ తర్వాత సులభంగా అరగక బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు మారుతున్న జీవనశైలి, నిద్రలేమి, ధూమపానం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లు కండరాల పరిమాణాన్ని తగ్గించి జీవక్రియలను మరింత మందగింపజేస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. అయితే, కొన్ని చిన్నపాటి ఆరోగ్యకరమైన మార్పులను రోజూవారి అలవాట్లలో భాగం చేసుకోవడం ద్వారా జీవక్రియల వేగాన్ని తిరిగి పుంజుకునేలా చేయవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
కారం కలిగిన ఆహారం తీసుకోవడం మెటబాలిజాన్ని పెంచడంలో కొంతవరకు తోడ్పడుతుంది. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థం కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం వల్ల పెరిగే అదనపు బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో ఐదు గ్రాముల మిరపకాయలు తీసుకోవడం వల్ల సుమారు 30 నిమిషాల పాటు జీవక్రియ వేగం దాదాపు 20 శాతం వరకు పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.
కేలరీలను కరిగించడంలో కార్డియో వ్యాయామాలు ఉపయోగపడితే.. కండరాల పరిమాణాన్ని కాపాడుకోవడంలో వెయిట్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ వ్యాయామాలు ఎంతో ఉపకరిస్తాయి. సాధారణ కొవ్వుతో పోలిస్తే కండరాలు విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తాయి. వృద్ధులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో 16 వారాల పాటు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయడం వల్ల కొవ్వు తగ్గి జీవక్రియల వేగం పెరిగినట్లు గుర్తించారు. ముఖ్యంగా మహిళలకు ఈ వ్యాయామాలు మరింత ప్రయోజనకరంగా పనిచేస్తాయి.
ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కండరాల నిర్మాణం, సంరక్షణ వేగవంతమవుతాయి. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకునే వ్యక్తుల్లో విశ్రాంతి సమయంలో కూడా శరీరం అధిక కేలరీలను కరిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం వేళ అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానేయకూడదు. నిద్రలేచిన రెండు గంటలలోపు ప్రోటీన్లతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల రోజంతా అదనపు చిరుతిండ్లు, చక్కెర పదార్థాలు తినాలనే కోరిక తగ్గుతుంది. క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకునే వారు రోజంతా ఎక్కువ కేలరీలను ఖర్చు చేయగలరని బ్రిటన్‌లో జరిగిన ఒక పరిశోధన వెల్లడించింది.
శరీరాన్ని ఎప్పుడూ సరిపడా నీటితో హైడ్రేట్‌గా ఉంచుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి అతిగా తినడం తగ్గుతుంది. చల్లని నీటి కంటే గోరువెచ్చని నీరు లేదా గది ఉష్ణోగ్రతలో ఉండే నీటిని క్రమం తప్పకుండా తాగడం జీవక్రియల వేగాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి
(The above story first appeared on LatestLY on Aug 03, 2026 01:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

