భారతదేశంలో అంటువ్యాధుల వ్యాప్తి క్రమంగా పెరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) తాజా నివేదిక స్పష్టం చేసింది. ప్రజారోగ్యానికి కీలకమైన వైరల్ ఇన్ఫెక్షన్లను గుర్తించే లక్ష్యంతో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీస్ (VRDL) నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాలపై విశ్లేషణ జరిపింది. ఈ పరిశీలనలో ఆందోళన కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
2025 మొదటి ఆరు నెలల కాలంలో VRDL ల్యాబ్‌లు పరీక్షించిన 4.5 లక్షల మంది రోగులలో 11.1% మందిలో వ్యాధికారకాలు (pathogens) కనుగొన్నారు. జనవరి నుండి మార్చి వరకు పరీక్షించిన 2,28,856 నమూనాలలో 24,502 (10.7%) నమూనాలు పాజిటివ్‌గా తేలగా, ఏప్రిల్ నుండి జూన్ మధ్య పరీక్షించిన 2,26,095 నమూనాలలో 26,055 (11.5%) నమూనాలు పాజిటివ్‌గా నిర్ధారించబడ్డాయి. ఈ రెండు త్రైమాసికాల మధ్య వ్యత్యాసం 0.8 శాతం పాయింట్లు ఉండటం, దేశంలో అంటువ్యాధుల వ్యాప్తి కొద్దిగా పెరుగుతోందని సూచిస్తోంది.
ప్రధానంగా గుర్తించిన వైరస్‌లు: ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం, విభిన్న వ్యాధులలో వేర్వేరు వైరస్‌లు ప్రధాన కారకాలుగా ఉన్నట్లు గుర్తించారు.
అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (ARI) మరియు తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) కేసుల్లో ఇన్‌ఫ్లుఎంజా A వైరస్
తీవ్రమైన జ్వరం మరియు రక్తస్రావ జ్వరాలలో డెంగ్యూ వైరస్
కామెర్లు (జాండిస్) కేసుల్లో హెపటైటిస్ A వైరస్
తీవ్రమైన డయేరియా వ్యాధులలో నోరోవైరస్
అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ (AES) కేసుల్లో హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (HSV) ప్రధాన వ్యాధికారకాలుగా తేలాయి.
ఒక సీనియర్ శాస్త్రవేత్త ప్రకారం.. ఈ పెరుగుదల చిన్నదిగా కనిపించినా, దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది కాలానుగుణంగా వ్యాపించే అంటువ్యాధులు మరియు కొత్తగా ఉద్భవించే ఇన్ఫెక్షన్లకు ముందస్తు హెచ్చరికలాంటిదేనని ఆయన పేర్కొన్నారు. త్రైమాసిక స్థాయిలో ఇన్ఫెక్షన్ రేట్లను విశ్లేషించడం ద్వారా, భవిష్యత్తులో పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే వ్యాధులను సకాలంలో గుర్తించి నివారించడం సాధ్యమవుతుందని ఐసీఎంఆర్ అధికారులు అంటున్నారు.
2014లో కేవలం 27 ల్యాబ్‌లతో ప్రారంభమైన VRDL నెట్‌వర్క్, ప్రస్తుతం 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 165 ల్యాబ్‌లకు విస్తరించింది. ఈ ల్యాబ్‌ల ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,534 వ్యాధి సమూహాలను (outbreaks) గుర్తించారు. 2014 నుండి 2024 మధ్య 40 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించగా, వాటిలో 18.8% నమూనాల్లో వ్యాధికారకాలు ఉన్నట్లు తేలింది.
2025 ఏప్రిల్–జూన్ కాలంలో పరిశోధన చేసిన 191 వ్యాధుల సమూహాల్లో గవదబిళ్ళలు (chickenpox), మీజిల్స్, రుబెల్లా, డెంగ్యూ, చికున్‌గున్యా, రోటవైరస్, నోరోవైరస్, వరిసెల్లా జోస్టర్ వైరస్, ఎప్స్టీన్-బార్ వైరస్ (EBV) మరియు ఆస్ట్రోవైరస్ వంటి అనేక అంటువ్యాధులు గుర్తించబడ్డాయి. అదేవిధంగా జనవరి–మార్చి మధ్యకాలంలో 389 వ్యాధి సమూహాలను పరిశోధించి, హెపటైటిస్, లెప్టోస్పైరా, ఇన్‌ఫ్లుఎంజా, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STIs) వంటి ఇతర అంటువ్యాధులు కూడా గుర్తించారు.
ఈ నివేదిక భారత్‌లో అంటువ్యాధుల పట్ల జాగ్రత్త ఉండాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. తక్కువ శాతం పెరుగుదలైనా, అది రాబోయే నెలల్లో వ్యాధి వ్యాప్తి ధోరణులపై కీలక సూచనగా పరిగణించాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.