Hyderabad, JAN 22: తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర సగటు కనిష్ట ఉష్ణోగ్రత 6.9గా నమోదైంది. రాష్ట్రంలోని సంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా 24 జిల్లాల్లో 14.5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా కోహిర్ 6.9 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే విధంగా కొమరుంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీలో 7.2, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 8.1, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 8.5, వికారాబాద్ జిల్లా మారెపల్లిలో 9, కామారెడ్డి జిల్లా మద్దూర్‌లో 9.6, రాజన్నసిరిసిల్లలో 9.7, మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్‌లో 9.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ మేరకు 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 24 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.