ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఉత్తర ఒడిశా,వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గురువారం ఏర్పడనున్న మరో అల్పపీడనం వీటి ప్రభావంతో ఆదివారం వరకు అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు, విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శుక్ర,శనివారాల్లో కోస్తాలో పలుచోట్ల అతిభారీవర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.గురువారం నుంచి ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
విజయనగరం,మన్యం,అల్లూరి,విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు. శ్రీకాకుళం,కోనసీమ,కృష్ణా,గుంటూరు, బాపట్ల,పల్నాడు,ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు.