
Hyderabad, March 09: మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘#SSMB29’ వర్కింగ్ టైటిల్. చిత్రీకరణ ప్రారంభమవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. రెగ్యులర్ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ఒడిశాలో మొదలైంది. అయితే, ఆదివారం జరిగిన చిత్రీకరణకు సంబంధించిన విజువల్స్‌ను ఒకరు తమ ఫోన్‌లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యాయి. చాలామంది షేర్ చేయడం, లైక్ చేయడంతో SSMB29 హ్యాష్‌ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండింగ్‌లో జాబితాలో నిలిచింది. దీనిపై అప్రమత్తమైన చిత్ర బృందం వెంటనే చర్యలకు దిగింది. నెటిజన్లు షేర్ చేసిన వీడియోలను తొలగించే పనిలో పడింది. ప్రధాన పాత్రధారులైన మహేశ్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు ఆ వీడియో బట్టి అర్థమవుతోంది.
మహేశ్ బాబు ఈ సినిమా కోసం ప్రయత్నించిన కొత్త లుక్ బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభమైనట్టు టీమ్ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. తాజా ఘటనతో ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ టీమ్ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 28 వరకు తోలోమాలి, దేవ్‌మాలి, మాచ్‌ఖండ్ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన లోకేషన్లలో చిత్రీకరణ జరగనుంది. తోలోమాలి పర్వతంపై భారీ సెట్ రూపొందించారు. కీలక పాత్ర పోషించనున్న ప్రియాంక చోప్రా మరికొన్ని రోజుల్లో షూటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలిసింది.