
హైదరాబాద్ నగరం మరోసారి భారీ వర్షానికి విలవిలలాడింది. ఆదివారం సాయంత్రం గంటల తరబడి ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం పలు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, సనత్‌నగర్, యూసఫ్‌గూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే బీఎన్‌రెడ్డినగర్, నానక్‌రామ్‌గూడ తదితర ప్రాంతాల్లోనూ కుండపోత వర్షం పడింది.
వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు రోడ్లను నింపేసిన కారణంగా వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. ముఖ్యంగా పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, సనత్‌నగర్ పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనదారులు నెమ్మదిగా కదులుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాల క్యూలు కిలోమీటర్ల పొడవునా ఏర్పడ్డాయి.
ఇక వాతావరణశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాబోయే కొన్ని గంటల్లోనూ నగరంలో భారీ వర్షం కొనసాగనుందని తెలిపింది. ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఓస్మానియా యూనివర్సిటీ పరిసరాలు, ఎల్బీనగర్‌తో పాటు ఉత్తర, పశ్చిమ, సెంట్రల్ హైదరాబాద్ పరిధిలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అదేవిధంగా నగర పరిసర జిల్లాలు అయిన జనగాం, కరీంనగర్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా వచ్చే రెండు గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.
గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సంబంధిత జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు వర్ష సమయంలో రోడ్లపైకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డ్రైనేజీలు, వంతెనల కింద భాగాలు, లోతట్టు ప్రాంతాల్లో నీటిలో వాహనాలు నడపరాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయానికి లోనయ్యే అవకాశం ఉండడంతో, విద్యుత్ స్తంభాల దగ్గరగా వెళ్లకుండా ప్రజలకు సూచనలు జారీ చేశారు.
ఇక తెలంగాణలో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచిస్తోంది.హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో వర్షాలు మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సలహా ఇస్తున్నారు.