
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ వాయవ్య దిశగా కదలుతోంది. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి కె. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది నేడు భారత్ తీరాలను దాటి ప్రయాణించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాన్ని అధికారులు తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ప్రత్యేక అతిభారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేసింది ఐఎండీ. అల్పపీడనం ప్రభావంతో, తీరం ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు ఈ రెండు రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లకూడదని స్పష్టంగా సూచించారు.
తెలంగాణలో కూడా వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సిద్దిపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమని వాతావరణ శాఖ తెలిపింది.
గుండె సమస్యలు ఉన్నవారు ఏ వైపు పడుకుంటే మంచి నిద్ర వస్తుంది.. గుండె నిపుణులు ఏం చెబుతున్నారంటే..
హైదరాబాద్‌లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేక హెచ్చరిక జారీ చేశారు. మల్కాజిగిరి, హయత్ నగర్, బండ్లగూడ్, వనస్థలిపురం, సరూర్ నగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో గడిచిన రెండు రోజులుగా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది.
ములుగు జిల్లాలోని మల్లంపల్లి 21.7 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలోని ఇందుర్తి 21.13 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మెదక్ 19.85, రంగారెడ్డి 18, యాదాద్రి భువనగిరి 17.65 సెం.మీ. వరుసగా భారీ వర్షాలు కురిసినట్లు వివరించారు. దీంతో పంటలు నీటమునిగిపోయాయి, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
అల్పపీడనం తీరం దాటినా సెప్టెంబర్ 14 వరకు దాని ప్రభావం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అందువల్ల, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు నిరంతరం హెచ్చరిస్తున్నారు.