Total Solar Eclipse 2026: ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో ఎందుకు కనిపించదు? పూర్తి వివరాలు ఇవిగో..
Total Solar Eclipse 2026: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు, నక్షత్ర వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12న సంభవించనుంది. ఆకాశంలో ఆవిష్కృతమయ్యే ఈ అద్భుత దృశ్యం పగటిపూటే కారు చీకట్లను అలుముకునేలా చేయనుంది. అయితే భారత్‌లోని వీక్షకులకు మాత్రం ఈ అరుదైన దృశ్యాన్ని నేరుగా వీక్షించే అవకాశం లేదు.
Total Solar Eclipse 2026: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు, నక్షత్ర వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12న సంభవించనుంది. ఆకాశంలో ఆవిష్కృతమయ్యే ఈ అద్భుత దృశ్యం పగటిపూటే కారు చీకట్లను అలుముకునేలా చేయనుంది. అయితే భారత్‌లోని వీక్షకులకు మాత్రం ఈ అరుదైన దృశ్యాన్ని నేరుగా వీక్షించే అవకాశం లేదు.
భూమికి, సూర్యునికి మధ్యలోకి చంద్రుడు నేరుగా వచ్చి సూర్యగోళాన్ని పూర్తిగా కప్పివేసినప్పుడు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో పగటిపూట కూడా ఆకాశం చీకటై.. రాత్రి సమయాన్ని తలపిస్తుంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడమే కాకుండా.. మిణుకుమిణుకుమనే నక్షత్రాలు, గ్రహాలు పగలే ఆకాశంలో ప్రత్యక్షమవుతాయి.
సూర్యుడు చంద్రుడి కంటే 400 రెట్లు పెద్దవాడైనప్పటికీ.. భూమికి 400 రెట్లు ఎక్కువ దూరంలో ఉండటం వల్ల మనకు ఆకాశంలో ఇద్దరూ ఒకే పరిమాణంలో కనిపిస్తారు. ఈ ఖగోళ యాదృచ్ఛికత వల్లే సంపూర్ణ సూర్యగ్రహణం సాధ్యమవుతోందని నాసా (NASA) వివరించింది.
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, అట్లాంటిక్ మహాసముద్రం, స్పెయిన్ దేశాలలో స్పష్టంగా కనిపిస్తుంది. పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇది కనిపిస్తుంది. ఇక ఉత్తర అమెరికా (అలాస్కా నుండి నార్త్ కరోలినా వరకు), కెనడా, యూరప్, వాయువ్య ఆఫ్రికాలలో ఇది పాక్షిక సూర్యగ్రహణంగా కనిపిస్తుంది. విదేశాల్లోని అనేక ప్రాంతాలలో సూర్యుడు గ్రహణ స్థితిలోనే అస్తమించనున్నందున.. అక్కడి ప్రజలకు అరుదైన 'సూర్యాస్తమయ గ్రహణం' చూసే అవకాశం దక్కనుంది.
ఈ అద్భుతం భారత్‌లో కనిపించకపోవడానికి ప్రధాన కారణం సమయమేనని చెప్పవచ్చు. భారత ప్రామాణిక కాలమానం (IST) ప్రకారం, ఈ గ్రహణం ఆగస్టు 12న రాత్రి 9:45 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 13న తెల్లవారుజామున 2:15 గంటల వరకు కొనసాగుతుంది. ఆ సమయంలో మన దేశంలో రాత్రి వేళ కావడం.. సూర్యుడు క్షితిజానికి బాగా దిగువన ఉండటంతో భూమిపై నుంచి నేరుగా చూడటం సాధ్యపడదని నిపుణులు వెల్లడించారు.
భారతీయులు నిరాశ చెందాల్సిన అవసరం లేకుండా అంతరిక్ష పరిశోధనా సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. నాసా (NASA), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తమ అధికారిక వెబ్‌సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఖగోళ దృశ్యాన్ని హై-డెఫినిషన్ (HD) నాణ్యతతో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. దీని ద్వారా భారతీయ ఖగోళ ప్రేమికులు ఇంట్లోనే ఉంటూ ఈ గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
(The above story first appeared on LatestLY on Jul 29, 2026 05:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

