Andhra Pradesh Governor S Abdul Nazeer (Photo/Andhra Pradesh I and PR Department)

AP Assembly Monsoon Session: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ వివరాల ప్రకారం.. ఆగస్టు 17న ఉదయం 9:00 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవనంలోని అసెంబ్లీ హాల్‌లో శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు ఉదయం 10:00 గంటలకు కౌన్సిల్ హాల్‌లో శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈ వర్షాకాల సమావేశాల ప్రకటన వెలువడిన తరుణంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేత సమగ్ర విచారణ జరిపించాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం నెల్లూరు నగరంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

మెడికో ప్రియాంకను కారుతో గుద్దిన వీడియోలు ఇవిగో.. చికిత్స పొందుతూ పీజీ వైద్య విద్యార్థిని మృతి..కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తండ్రి..

ప్రభుత్వం వాగ్దానం చేసిన మెగా డీఎస్సీని 'మోసపూరిత డీఎస్సీ'గా మార్చారని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

నిరసన సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమం తర్వాత రాష్ట్రంలో ఇంతటి భారీస్థాయి నిరసన ఉద్యమం జరగలేదని అన్నారు. మెగా డీఎస్సీ వివాదంతో పాటు విద్యార్థులకు నిలిపివేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి చెల్లింపులపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ప్రజలకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

మరో వైపు 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత (ఎల్‌ఓపీ) హోదా కల్పించకపోవడంపై నిరసనగా శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ప్రతిపక్ష హోదా ఇవ్వనంత వరకు అసెంబ్లీకి హాజరయ్యే ప్రసక్తే లేదని.. ప్రజల గొంతుకను వినిపించేందుకు ఈ హోదా నిబంధనల ప్రకారం దక్కాల్సిందేనని వైసీపీ స్పష్టం చేస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉన్న సంగతి తెలిసిందే.

అసెంబ్లీని బహిష్కరించినప్పటికీ.. శాసనమండలి (కౌన్సిల్) సమావేశాలకు మాత్రం హాజరుకావాలని వైసీపీ నిర్ణయించుకుంది. శాసనమండలిలో పార్టీకి పూర్తి మెజారిటీ ఉండటంతో, అక్కడ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని భావిస్తోంది. ముఖ్యంగా మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న అంశాన్ని కౌన్సిల్‌లో ప్రధానంగా లేవనెత్తేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. దీంతో రాబోయే వర్షాకాల సమావేశాల్లో శాసనమండలి వేదికగా ప్రభుత్వం, విపక్షాల మధ్య తీవ్రస్థాయి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.