New Districts in AP: ఏపీలో 26 జిల్లాల పూర్తి సమాచారం, ఏ నియోజకవర్గం ఏ జిల్లాకు వెళుతోంది, ముఖ్య కేంద్రంగా ఏదీ ఉండబోతోంది, ఏపీలో కొత్త జిల్లాలపై సమగ్ర కథనం

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 జిల్లాల స్థానంలో 26 కొత్త జిల్లాలను (New Districts in AP) ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

New Districts in AP: ఏపీలో 26 జిల్లాల పూర్తి సమాచారం, ఏ నియోజకవర్గం ఏ జిల్లాకు వెళుతోంది, ముఖ్య కేంద్రంగా ఏదీ ఉండబోతోంది, ఏపీలో కొత్త జిల్లాలపై సమగ్ర కథనం
AP CM YS Jagan |File Photo

Amaravati, Jan 26: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 జిల్లాల స్థానంలో 26 కొత్త జిల్లాలను (New Districts in AP) ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తోంది. ఫిబ్రవరి 26 వరకు కొత్త జిల్లాలపై (Andhra Pradesh Gets 13 New Districts in State) అభిప్రాయాలు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన సాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉన్నాయి. వాటిని 26 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్విభజించింది. పునర్వ్యస్థీకరణ తర్వాత 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రకాశం అతి పెద్ద జిల్లాగా అవతరించనుంది. 928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విశాఖపట్నం అతి చిన్న జిల్లాగా ఉండనుంది. జనాభా పరంగా కర్నూలు 23.66 లక్షల జనాభాతో పెద్ద జిల్లా అవుతుంది. అతి తక్కువగా 9.54 లక్షల జనాభాతో అరకు చిన్న జిల్లాగా ఉంది. రెండు గిరిజన జిల్లాలు అల్లూరి, మన్యం.. ఏర్పాటు కానున్నాయి. అల్లూరి జిల్లాలో అతి తక్కువగా 3 నియోజకవర్గాలు ఉన్నాయి.

ఏపీ కొత్త జిల్లాల ప్రతిపాదనలు సిద్ధం, 26 జిల్లాలకు ఆమోదం తెలిపిన కేబినెట్

శ్రీకాకుళం కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. ఈ జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, అముదాలవలస, పాతపట్నం, నరసన్నపేట శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు (టెక్కలి, శ్రీకాకుళం), 30 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 4,592 చ.కిమీ, జనాభా: 21.91 లక్షలు.

విజయనగరం కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపు కోట, గజపతినగరం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవిన్యూ డివిజన్లు విజయనగరం, బొబ్బిలి (కొత్త), 26 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 3,846 చ.కి.మీ, జనాభా: 18.84 లక్షలు.

విశాఖపట్నం కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు విశాఖపట్నం, భీమిలి(కొత్త), 10 మండలాలు ఉంటాయి. రాష్ట్రంలో అతిచిన్న జిల్లాగా విశాఖపట్నం ఏర్పాటుకానుంది. విస్తీర్ణం: 928 చ.కిమీ, జనాభా: 18.13 లక్షలు.

అనకాపల్లి కేంద్రంగా 7 అసెంబ్లీ నియెజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. ఈ జిల్లాలో పాయకరావు పేట, నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, చోడవరం శాసనసభ స్థానాలను చేర్చారు. రెవెన్యూ డివిజన్లు అనకాపల్లి, నర్సీపట్నం, 25 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 4,412 చ.కి.మీ, జనాభా: 18.73 లక్షలు.

అగ్రవర్ణాల మహిళల అకౌంట్లోకి రూ. 15 వేలు, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, మొత్తం 3,92,674 మంది ఖాతాల్లోకి రూ.589 కోట్లు

కాకినాడ కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త ఏర్పాటు కానుంది. తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు పెద్దాపురం, కాకినాడ, 19 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 2,605 చ.కి.మీ, జనాభా:19.37 లక్షలు

అమలాపురం కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో కోనసీమ జిల్లా ఏర్పాటు కానుంది. రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం శాసనసభ స్థానాలను చేర్చారు. రెవెన్యూ డివిజన్లు అమలాపురం, రామచంద్రాపురం, 24 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం : 2,615 చ.కి.మీ, జనాభా: 18.73 లక్షలు.

రాజమహేంద్రవరం కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో తూర్పు గోదావరి జిల్లా ఏర్పాటు కానుంది. అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు రాజమహేంద్రవరం, కొవ్వూరు, 20 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 2,709 చ.కి.మీ, జనాభా:19.03 లక్షలు.

భీమవరం కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పశ్చిమ గోదావరి జిల్లా ఉండనుంది. అచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లి గూడెం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు నర్సాపురం, భీమవరం (కొత్త), 19 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 2,178 చ.కి.మీ, జనాభా: 17.80 లక్షలు.

ఏలూరు కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు కానుంది. ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు ఏలూరు, నూజివీడు, జంగారెడ్డి గూడెం, 27 మండలాలు ఉండనున్నాయి. విస్తీర్ణం: 6,413 చ.కిమీ, జనాభా: 20.03 లక్షలు.

మచిలీపట్నం కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు కానుంది. గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు గుడివాడ, మచిలీపట్నం, 25 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 3,755 చ.కిమీ, జనాభా: 17.35 లక్షలు.

విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఏర్పాటు కానుంది. విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు నందిగామ (కొత్త), తిరువూరు (కొత్త), విజయవాడ, 20 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం:3,316 చ.కిమీ, జనాభా:22.19 లక్షలు.

గుంటూరు కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకానుంది. తాడికొండ, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, పత్తిపాడు శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు గుంటూరు, తెనాలి, 18 మండలాలు ఉండన్నాయి. విస్తీర్ణం :2,443 చ.కిమీ, జనాభా: 20.91 లక్షలు.

పల్నాడు కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో నరసరావుపేట జిల్లా ఏర్పాటుకానుంది. పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరి పేట, నరసరావుపేట, వినకొండ, సత్తెనపల్లి శాసనసభ స్థానాలను చేర్చారు. రెవెన్యూ డివిజన్లు గురజాల, నరసరావుపేట, 28 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 7,298 చ.కిమీ, జనాభా: 20.42 లక్షలు

బాపట్ల (బావపురి) కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకానుంది. వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు బాపట్ల (కొత్త), చీరాల (కొత్త), 25 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 3, 829 చ.కిమీ, జనాభా: 15.87 లక్షలు

ఒంగోలు కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో ప్రకాశం జిల్లా ఏర్పాటుకానుంది. యర్రగొండపాలెం, గిద్దలూరు, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి, మార్కాపురం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు మార్కాపురం, ఒంగోలు, పొదిలి (కొత్త), 38 మండలాలు ఉంటాయి విస్తీర్ణం: 14,322 చ.కిమీ, జనాభా:22.88 లక్షలు.

నంద్యాల కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకానుంది. నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూర్, శ్రీశైలం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు నంద్యాల, డోన్ (కొత్త), ఆత్మకూర్ (కొత్త), 27 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 9,155 చ.కిమీ, జనాభా:16.87 లక్షలు,

కర్నూలు కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకానుంది. పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు కర్నూలు, ఆదోని, 28 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 8,507 చ.కిమీ, జనాభా: 23.66 లక్షలు.

అనంతపురం కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకానుంది. రాయదుర్గం, కల్యాణదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్‌, గుంతకల్, ఉరవకొండ, రాప్తాడు, తాడిపత్రి శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు కల్యాణ దుర్గం, అనంతపురం, గుంతకల్, 34 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 11,359 చ.కిమీ, జనాభా:23.59 లక్షలు.

పుట్టపర్తి కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటుకానుంది. మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు ధర్మవరం, పెనుకొండ, పుట్టపర్తి (కొత్త), 29 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 7,771 చ.కిమీ, జనాభా: 17.22 లక్షలు

కడప కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో వైఎస్ఆర్‌ జిల్లా ఏర్పాటు కానుంది. కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు కడప, జమ్మలమడుగు, బద్వేల్, 34 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 10.723 చ.కిమీ, జనాభా: 19.90 లక్షలు

నెల్లూరు కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా ఏర్పాటుకానుంది. కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు కావలి, నెల్లూరు, ఆత్మకూరు, 35 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 9,141 చ.కిమీ, జనాభా: 23.37 లక్షలు

తిరుపతి కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో బాలాజీ జిల్లా ఏర్పాటుకానుంది. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు శాసనసభ స్థానాలను చేర్చారు. రెవెన్యూ డివిజన్లు గూడూరు, తిరుపతి, నాయుడుపేట, 35 మండలాలు ఉంటాయి. విస్లీర్ణం: 9,176 చ.కిమీ, జనాభా: 22.18 లక్షలు.

రాయచోటి కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా ఏర్పాటుకానుంది. రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు శాసనసభ స్థానాలను చేర్చారు. రెవెన్యూ డివిజన్లు మదనపల్లె, రాజంపేట, రాయచోటి (కొత్త), 32 మండలాలు ఉంటాయి. విస్లీర్ణం: 8,459 చ.కిమీ, జనాభా: 17.68 లక్షలు.

చిత్తూరు కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకానుంది. నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు,కుప్పం, పుంగనూరు శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు చిత్తూరు, పలమనేరు (కొత్త), 33 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 7,210 చ. కిమీ, జనాభా: 19.85 లక్షలు

పార్వతీపురం కేంద్రంగా 4 అసెంబ్లీ నియోజకవర్గాలతో మన్యం జిల్లా ఏర్పాటుకానుంది. పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు పార్వతీపురం, పాలకొండ, 16 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 3, 935 చ.కిమీ, జనాభా: 9.72 లక్షలు.

పాడేరు కేంద్రంగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటుకానుంది. పాడేరు, అరకు, రంపచోడవరం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు పాడేరు, రంపచోడవరం, 22 మండలాలు ఉంటాయి. విస్తీర్ణం: 12,251 చ.కిమీ, జనాభా: 9.54 లక్షలు.

(The above story first appeared on LatestLY on Jan 26, 2022 04:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).