Amaravati, Jan 25: అగ్రవర్ణాల్లోని పేద మహిళలకూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) అండగా నిలిచింది. వారి ఆర్థిక సాధికారత కోసం ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పేరుతో మరో కొత్త పథకానికి (YSR EBC Nestam Scheme) శ్రీకారం చుట్టింది. మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్నిసీఎం జగన్ (AP CM YS Jagan) ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కి మొత్తం 3,92,674 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.589 కోట్లను వారి ఖాతాల్లో ఆయన జమచేశారు. ఈ పథకం ద్వారా ఒక్కో అక్కచెల్లెమ్మకు ఏటా రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఆర్థికసాయం అందనుంది.
ఇప్పటికే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ.. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం.. అక్కచెల్లెమ్మల పేరిట ఉచిత ఇళ్ల పట్టాలు, ఇళ్లు.. మొదలైన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారి కాళ్ల మీద వారిని నిలబెడుతూ వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు మహిళా సంక్షేమంలో మరో అడుగు ముందుకు వేస్తోంది.
మేనిఫెస్టోలో చెప్పకపోయినా రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజికవర్గాల్లోని (ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాలు) పేద మహిళలకు కూడా మేలుచేయాలన్న సత్సంకల్పంతో వారికి మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు రూపొందించిన కానుకే ఈ ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’గా చెప్పవచ్చు.