MP Vijayasai Reddy Press Meet: కేంద్ర శాఖల కార్యదర్శులతో ముగిసిన ఏపీ బృందం భేటీ, త్వరలోనే మంచి సమాచారం వస్తుందని తెలిపిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
YSRCP MP Vijayasai Reddy Press Meet after AP delegation meets with Central Secretaries (Photo-Video Grab)

Amaravati, Jan24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెండింగ్ సమస్యలపై కేంద్రంతో ఏపీ ప్రతినిధి బృందం భేటీ ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy Press Meet) మీడియాతో మాట్లాడుతూ... ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన వినతిపత్రంలోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించామని,పరిష్కార మార్గాలను అన్వేషించామన్నారు.

సమావేశం మొత్తం సానుకూలంగా జరిగిందని, త్వరలోనే మంచి సమాచారం వస్తుందని ఆయన (YSRCP MP Vijayasai Reddy Press Meet) తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 20 మంది ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు సమావేశంలో పాల్గొన్నారని, దీనికి కొనసాగింపుగా సంబంధిత అధికారులు నిరంతరం సంప్రదింపులు చేసి, ఈ అంశాలన్నింటినీ ముందు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పోలవరం సవరించిన అంచనాలను యధావిధిగా ఆమోదించేందుకు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. పునరావాసం సహా అన్ని అంశాలపై రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు జరిగాయని అన్నారు. ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యత కు ఈ సమావేశం నిదర్శనమని ఆయన అన్నారు.

టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్, మంత్రి కొడాలి నాని, రాష్ట్ర డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వం వహించిన ఈ బృందంలో (AP delegation meets with Central Secretaries) ఏపీ ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సహా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని రాష్ట్ర ప్రతినిధుల బృందం కేంద్ర కార్యదర్శుల బృందాన్ని కోరింది. రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని, విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన సంస్థలన్నింటికీ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం కోరింది.

కేంద్ర కార్యదర్శుల బృందం దృష్టికి తీసుకెళ్లిన వివరాలు

పోలవరం ప్రాజెక్టు: కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేస్తే.. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దేశంలో మిగిలిన 15 జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నీటి పారుదల, తాగునీటి వ్యయాలను ఒక్కటిగానే పరిగణించి నిధులివ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,100 కోట్లను త్వరితగతిన మంజూరు చేసి, ప్రాజెక్టు పనులకు అంతరాయం కలగకుండా చూడాలి.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి: రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 45 శాతం ఆదాయం (రెవెన్యూ) మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా.. ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇదే నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చడానికి సహకరించాలి.

రెవెన్యూ లోటు : 2014 జూన్‌ నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నిర్ధారించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతి తీసుకొచ్చి రెవెన్యూ లోటును రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులు, ఇతర బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కాబట్టి రెవెన్యూ లోటు కింద రావాల్సిన రూ.18,830.87 కోట్లను చెల్లించి ఆదుకోవాలి.

విద్యుత్‌ చార్జీలు: విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకు ఏపీ జెన్‌కో ద్వారా విద్యుత్‌ సరఫరా చేశాం. ఇందుకు రూ.6,284 కోట్లను విద్యుత్‌ చార్జీల రూపంలో తెలంగాణ ఏపీకి చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో.. ఆ బిల్లులను చెల్లించేలా తెలంగాణ సర్కార్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలి.

జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. దీని వల్ల రాష్ట్రంలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్‌ ద్వారా రేషన్‌ అందిస్తోంది. దీని వల్ల అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన చేసి, ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలి. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందే వెసులుబాటు కల్పించాలి.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చిన సైట్‌ క్లియరెన్స్‌ను రెన్యువల్‌ చేయాలి. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు మెకాన్‌ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థకు గనులను వేగంగా కేటాయిస్తే.. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతుంది.