Land Resurvey in AP: ఏపీలొ భూముల సమగ్ర రీ సర్వే, 37 గ్రామాల్లో తొలిదశగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు, వచ్చే మూడు వారాల్లో మరో 14 చోట్ల ప్రారంభమవుతాయని తెలిపిన ఏపీ సీఎ వైఎస్ జగన్
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం ద్వారా చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే (Land Resurvey in AP) అతిపెద్ద సంస్కరణ కార్యక్రమమని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 37 గ్రామాల్లో తొలిదశగా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని, వచ్చే మూడు వారాల్లో మరో 14 చోట్ల ప్రారంభమవుతాయని చెప్పారు.
Amaravati, Jan 17: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం ద్వారా చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే (Land Resurvey in AP) అతిపెద్ద సంస్కరణ కార్యక్రమమని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 37 గ్రామాల్లో తొలిదశగా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని, వచ్చే మూడు వారాల్లో మరో 14 చోట్ల ప్రారంభమవుతాయని చెప్పారు.
సర్వే పూర్తి అయ్యాక దశలవారీగా అన్ని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సదుపాయాన్ని (one-time land registration scheme) కల్పిస్తామని ప్రకటించారు. సమగ్ర భూముల సర్వే కింద మొదటి దశలో 51 గ్రామాలలో రీ సర్వే, అభ్యంతరాల పరిష్కారం, భూ రికార్డులు ప్రజలకు అంకితం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేవుడి దయతో దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో అత్యంత శాస్త్రీయ విధానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన తొలి దశ సమగ్ర భూసర్వేని 51 గ్రామాలలో పూర్తి చేశాం. 37 గ్రామ సచివాలయాల్లో ఇవాళ్టి నుంచే భూములు, స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియచేసేలా ఈ రోజు మొట్టమొదటి అడుగు వేస్తున్నాం.
దేశంలో సుమారు 100 ఏళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో భూముల సమగ్ర సర్వే జరిగింది. 1983 వరకు జమాబందీ విధానంలోనే భూములకు సంబంధించిన అభ్యంతరాలను పరిష్కరించారు. ఆ తర్వాత కరణాల వ్యవస్ధ రద్దు కావడం, సరైన ప్రత్యామ్నాయం లేక జమాబందీ కార్యక్రమాలు ఆగిపోయాయి. మన భూమిని మన కళ్లెదుటే ఇతరుల పేరిట రాసుకుంటున్నారు. ట్యాంపరింగ్ జరుగుతోందని తెలుస్తున్నా అడ్డుకోలేని నిస్సహాయ స్థితి నెలకొంది.
నాడు–నేడు పథకం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.కోటి విరాళం ఇచ్చిన పోకర్ణ గ్రూప్ సీఎండీ గౌతమ్‌చంద్ జైన్
నా పాదయాత్ర సమయంలో 13 జిల్లాలోనూ ప్రజలు ఇదే ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులు, వాస్తవంగా ఉన్న భూమికి మధ్య వ్యత్యాసాలు సివిల్ వివాదాలకు దారి తీస్తున్నాయి. రిజిస్ట్రేషన్ జరిగిన భూమి విస్తీర్ణాన్ని కొలత వేస్తే కొన్నిసార్లు ఎక్కువగా ఉంటోంది, మరికొన్నిసార్లు తక్కువగా చూపిస్తోంది. భూ వివాదాలాన్నీ మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఓ సర్వే నంబర్‌లో అమ్మకాలు జరిగిపోతాయి కానీ సబ్ డివిజన్ మాత్రం ఉండదు. పట్టాదారు పాస్ పుస్తకాల వల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరడం లేదు. నిర్దిష్ట హద్దులు, శాశ్వత హక్కులు లేకపోవడం వల్ల రికార్డుల్లో తమ భూముల వివరాలు తారుమారు అయ్యాయనే ఫిర్యాదులు విపరీతంగా పెరిగిపోతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
సివిల్ వివాదాల్లో దాదాపు 80 – 90 శాతం కేసులు భూమి తగాదాలకు సంబంధించినవే కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. సరైన వ్యవస్థ లేకపోవడం, ట్యాంపరింగ్, ఇతరత్రా లోపాల వల్ల కష్టపడి సంపాదించిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన సంపద చేజారిపోయే పరిస్థితి రావడం ఎవరికైనా బాధాకరమే. సివిల్ వివాదాలకు ముగింపు పలికేలా భూములన్నీ కొలత వేసి అక్షాంశాలు, రేఖాంశాలు (లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్) ఆధారంగా మార్కింగ్ చేయడమే కాకుండా ప్రతి కమతానికి నిర్దిష్టంగా ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయిస్తున్నాం.
ప్రతి కమతాన్ని డిజిటల్‌గా నిర్ణయించి క్యూఆర్ కోడ్‌తో ల్యాండ్ మ్యాప్ ఇస్తున్నాం. సరిహద్దు రాళ్లు పాతి మరీ ఇస్తున్నాం. దీనివల్ల భూ వివాదాలు ఉండవు. ఎవరైనా ఆక్రమించుకుంటారనే భయం తొలగిపోతుంది. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు, లంచాలకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఇది సాకారం కావాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు –భూరక్ష పథకాన్ని దాదాపు 13 నెలల క్రితం ప్రారంభించామని సీఎం తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్కరి భూమిని 2023 కల్లా ఆధునిక పద్ధతుల్లో సమగ్రంగా రీసర్వే చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రీసర్వే చేయడమే కాకుండా యూనిక్ ఐడీ క్రియేట్ చేయడం, డేటా మొత్తం సబ్‌డివిజన్లతో పూర్తిగా అప్‌డేట్ చేస్తున్నాం. ఆ తర్వాత పక్కాగా పట్టా డాక్యుమెంట్స్ భూ యజమానుల చేతుల్లో పెడతాం. 2020 డిసెంబరు 21న భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టాం. కార్స్, డ్రోన్స్ టెక్నాలజీ లాంటి 50 అంశాలపై 10,158 మందికి సర్వే కోసం శిక్షణ ఇచ్చాం. ఈ ప్రాజెక్టు కోసం దాదాపుగా రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 4,500 సర్వే బృందాలను నియమించాం. 2 వేల రోవర్లు, 75 కార్స్ బేస్ స్టేషన్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టామని సీఎం అన్నారు.
సమగ్ర సర్వే తొలిదశ 51 గ్రామాలలో 12,776 మంది భూ యజమానులకు చెందిన 21,404 భూ కమతాలకు సంబంధించి 29,563 ఎకరాల రీసర్వే పూర్తైంది. 3,304 అభ్యంతరాలు, సివిల్ వివాదాలను పరిష్కరించాం. హద్దులు మార్పు చేసి మ్యాపులు, యూనిక్ ఐడీ క్రియేట్ చేయడం, క్యూఆర్ కోడ్‌లో భద్రపరచడంతో పాటు భూముల రికార్డులన్నీ పర్మినెంట్ టైటిల్స్‌తో భూ యజమానుల చేతుల్లో పెడుతున్నాం. భూముల సమగ్ర సర్వే వల్ల నకిలీ పత్రాలకు తావుండదు. భూ యజమానికి తెలియకుండా రికార్డులను మార్చే అవకాశం ఉండదు.
ఆస్తులు అమ్ముకున్నా సబ్‌డివిజన్ చేసిన తర్వాతే ఆ లావాదేవీల ఆధారంగా మాత్రమే భూ రికార్డుల్లో మార్పులు జరుగుతాయి. ఇతరుల ఆస్తిని కాజేసేందుకు ఆస్కారం ఉండదు. సర్వే చేసేటప్పుడు ప్రతి అడుగులోనూ భూయజమానులను భాగస్వాములుగా చేస్తున్నాం. వారి సమక్షంలోనే మంచి చేస్తున్నాం. అభ్యంతరాలను మండల స్ధాయిలో మొబైల్ మెజిస్ట్రేట్ బృందాల ద్వారా అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు.
తొలిసారిగా గ్రామకంఠాల్లోని ఇళ్లు, స్ధిరాస్తులను కూడా సర్వే చేసి యాజమాన్య ధృవీకరణ పత్రాలు అందచేస్తున్నాం. అవసరమైతే అమ్ముకునే స్వేచ్ఛ కూడా అన్ని రకాలుగా కల్పిస్తున్నాం. గ్రామ సర్వేయర్ల ద్వారా ఫీల్డ్ లైన్ దరఖాస్తులను 15 రోజుల్లో, పట్టా సబ్‌డివిజన్ దరఖాస్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలని గడువు విధించాం. సబ్‌డివిజన్ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలని ఇదే వేదిక నుంచి అధికారులను ఆదేశిస్తున్నామని సీఎం తెలిపారు. సింగిల్ విండో విధానంలో ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూహక్కు పత్రం అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. మనం ఏర్పాటు చేస్తున్న ఈ వ్యవస్ధ ద్వారా ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా భూ సమాచారాన్ని పొందే అవకాశం లభిస్తుందని సీఎం అన్నారు.
(The above story first appeared on LatestLY on Jan 19, 2022 12:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

