Polavaram Project Mission @2021: పోలవరం పనులు తిరిగి ప్రారంభం, భూమి పూజ చేసిన మేఘా సంస్థ ప్రతినిధులు, 2021 కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న ఏపీ సీఎం జగన్, తగ్గిన గోదావరి నీటి మట్టం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రారంభించింది. శుక్రవారం స్పిల్ వే వెనుక భాగంలో సంస్థ ప్రతినిధులు భూమి పూజ చేశారు. గోదావరి నీటిలో పసుపు, కుంకుమ చల్లి పూజలు జరిపారు.
Amaravathi, November 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రారంభించింది. శుక్రవారం స్పిల్ వే వెనుక భాగంలో సంస్థ ప్రతినిధులు భూమి పూజ చేశారు. గోదావరి నీటిలో పసుపు, కుంకుమ చల్లి పూజలు జరిపారు. ఈ సంధర్భంగా ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేసి తీరుతామని చెప్పారు. గోదావరి నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పున:ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం గోదావరిలో 1.21 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. మరో వారం రోజుల్లో తగ్గిపోనుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో పనులు పున:ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జూన్ నుంచి పనులు నిలిచిపోయిన విషయం విదితమే.
ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళికలో భాగంగా వచ్చే ఏడాది జూన్‌లోగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. వచ్చే జూన్‌లో వరదలు ప్రారంభమైనా స్పిల్ వే మీదుగా నదిలోకి మళ్లించి ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌ను(ఈసీఆర్‌ఎఫ్) పనులను నిరంతరాయంగా కొనసాగించడం ద్వారా 2021 నాటికి ప్రాజెక్టును సాకారం చేయాలని సంకల్పించింది.
పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిక రచించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్‌కు సమాంతరంగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను మే నెలలోగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలోగా 41.15 కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించే పనులను ఒక కొలిక్కి తీసుకురావాలని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్ వద్ద వరద నీటిని తోడేసి బురద, బంక మట్టిని తొలగించి.. అప్రోచ్ రోడ్లను వేసి, కాంక్రీట్ పనులు చేపట్టనున్నారు. కాగా రివర్స్ టెండరింగ్‌లో తక్కువ ధరలకు మేఘా ఇంజినీరింగ్ సంస్థ పనులు దక్కించుకున్న సంగతి విదితమే
(The above story first appeared on LatestLY on Nov 02, 2019 08:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

