APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కారు, ప్రతి నెలా జీతాలతో పాటు అలవెన్సులు కలిపి చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలతోపాటు అలవెన్సులు కూడా కలిపి చెల్లించాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ‘పే ఇన్ టు’లో డ్యూటీ బేస్డ్ అలవెన్సులను జీతాలతో పాటు కలిపి చెల్లించనుంది.
Vjy, Dec 12: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలతోపాటు అలవెన్సులు కూడా కలిపి చెల్లించాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ‘పే ఇన్ టు’లో డ్యూటీ బేస్డ్ అలవెన్సులను జీతాలతో పాటు కలిపి చెల్లించనుంది.
ఈ మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2024 జనవరి నుంచి ఈ విధానం అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నెల నైట్ అవుట్, డే అవుట్ అలవెన్సులు, ఓవర్ టైమ్ అలవెన్సులను జీతాలతో పాటే చెల్లించనున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 50 వేలమంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. కాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత నైట్ అవుట్, డే అవుట్, ఓటీ అలవెన్సులు విడిగా చెల్లిస్తున్నారు.
ఆ విధంగా కాకుండా విలీనానికి ముందు ఉన్నట్టుగానే జీతాలతోపాటు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించాలని నిర్ణయించింది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు, ఎస్‌ఆర్‌బీఎస్ ట్రస్ట్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా త్వరలోనే దశలవారీగా చెల్లించాలని నిర్ణయించింది.
ప్రభుత్వంలో విలీనానికి (2020 జనవరి 1కి) ముందు నుంచి ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్న వారికి పదోన్నతుల కల్పనకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం త్వరలోనే జారీ చేయనుంది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 1,026 మందికి పదోన్నతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలపై అప్పీల్ చేసుకునేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.
ఆర్టీసీలో ఉద్యోగ నిర్వహణకు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నిర్వహణకు ఉన్న వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకోవాలని విన్నవించారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా క్రమశిక్షణ చర్యలు అమలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
క్రమశిక్షణ చర్యలపై ఆర్టీసీ ఉద్యోగులు అప్పీల్ చేసేందుకు.. తదనంతరం సత్వరం పరిష్కరించేలా విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దానిపై రూపొందించిన ముసాయిదాను న్యాయశాఖ పరిశీలనకు పంపారు. త్వరలోనే క్రమశిక్షణ చర్యలపై ప్రత్యేకంగా అప్పీళ్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయనుంది.
(The above story first appeared on LatestLY on Dec 12, 2023 11:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

