Mission Build AP Case: ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం, హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

మిషన్‌ బిల్డ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Mission Build AP Case: ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం, హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
Supreme Court of India | Photo-IANS)

Amaravati, Feb 10: మిషన్‌ బిల్డ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా పదవీ విరణమణకు ఒక్కరోజు ముందు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు, తీర్పుపై స్టే విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు (Andhra Pradesh High Court) ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టాలని కోరింది. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

కాగా ఏపీ హైకోర్టు జస్టిస్ రాకేశ్ కుమార్ డిసెంబర్ 30న తీర్పును వెలువరించి, డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. తన తీర్పులో ముఖ్యమంత్రి జగన్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పై ఉన్న కేసుల వివరాలను తీర్పులో పొందుపరిచారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ రాసిన తర్వాత... రాష్ట్రంలోని అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయి. ఆ తర్వాత అవి వ్యక్తిగత అభిప్రాయాలుగా న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి, రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై తేలుస్తామంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్‌ దాఖలు చేసింది. రాజ్యాంగ వైఫల్యంపై అధికరణ 356 కింద రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చే కానీ న్యాయస్థానాలు కాదని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీల్‌లో పేర్కొంది.

ఏపీ హైకోర్టు ఆదేశాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపిన సుప్రీంకోర్టు, ఏపీలో రాజ్యాంగ సంక్షోభంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అత్యున్నత ధర్మాసనం

హైకోర్టు ఆదేశాలు ఏ మాత్రం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు నివేదించారు. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లలో రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామన్న హైకోర్టు ఉత్తర్వులు సహేతుకం కాదన్నారు. ఈ అప్పీల్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

కేసు పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అక్టోబర్‌ 1న హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ గతంలోనే న్యాయస్థానం​ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కొందరు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లు దాఖలు చేస్తే ఆ వ్యాజ్యాల్లో ఓ న్యాయస్థానం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం చూశామా? అంటూ విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆ న్యాయమూర్తులు భావించడానికి అంతగా ప్రభావితం చేసిన అంశాలేమున్నాయో అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించింది.

(The above story first appeared on LatestLY on Feb 10, 2021 03:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).