AP Fibernet Case: ఫైబర్‌నెట్ కేసు విచారణ ఈ నెల 30కి వాయిదా, దీపావళి సెలవుల తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ కేసు తీర్పు వెలువరిస్తామని తెలిపిన సుప్రీంకోర్టు
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ వాయిదా పడింది. ఈనెల 30న విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తెలిపింది
Vjy, Nov 9: ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ వాయిదా పడింది. ఈనెల 30న విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తెలిపింది. క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు బెయిల్‌పై విచారణ చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
ఏపీ సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. ఫైబర్‌నెట్ కేసులో ఈనెల 30 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. క్వాష్ పిటిషన్ పై విచారణ గత నెలలోనే ముగిసింది. తీర్పును ధర్మాసనం రిజర్వ్ లో ఉంచింది. ఈ నెల 23లోగా క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాతే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ జరుపుతామని సుప్రీం తెలిపింది.
సెక్షన్ 17ఏ నిబంధన ఈ కేసులోనూ ఉన్నందున స్కిల్ కేసు తీర్పు వచ్చాక విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కేసు ముగిసేవరకూ అరెస్ట్ చేయబోమన్న నిబంధన కొనసాగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. గత హామీ మేరకే ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలిపారు. కేసు విచారణను ఈనెల 23కి వాయిదా వేయాలని తొలుత ధర్మాసనం నిర్ణయించింది. అయితే సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తి మేరకు విచారణను సుప్రీంకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.
ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆయన విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. దీంతో, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు.
(The above story first appeared on LatestLY on Nov 09, 2023 02:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

