Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసు, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే కష్టాలు మరింత ఎక్కువవుతాయి, వైసీపీ పార్టీకి ఓటు వేయవద్దని తెలిపిన వైఎస్ సునీత
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసుపై ఆయన కూతురు వైఎస్ సునీత తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసుపై ఆయన కూతురు వైఎస్ సునీత తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పాలిటిక్స్ లో హత్యా రాజకీయాలు ఉండకూడదని వైఎస్ సునీత అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్య కేసు గురించి అడుగుతున్నారని చెప్పారు.
తన తండ్రి హత్య కేసు దర్యాప్తు (Vivekananda Reddy Murder Case) ఏళ్ల తరబడి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తాను చేస్తున్న పోరాటంలో తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, ఎంపీ రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని (YS Sunitha's bold statement on Father's Murder) విమర్శించారు. సీబీఐ సరిగ్గా విచారణ జరపాలని... కానీ, ఆ పని చేయడం లేదని, వారిపై ఏ ప్రెజర్ ఉందో తనకు తెలియదని చెప్పారు. ట్రయల్ జరిగితేనే హంతకులకు శిక్ష పడుతుందని తెలిపారు. అవినాశ్, భాస్కర్ రెడ్డిలు తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని, తప్పు చేస్తే వారిని శిక్షించాలని అన్నారు.
కర్నూలులో అవినాశ్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లి, అరెస్ట్ చేయకుండా సీబీఐ అధికారులు వెనక్కి వచ్చారని... ఎవరినైనా అరెస్ట్ చేయకుండా సీబీఐ వెనక్కి రావడం ఎప్పుడైనా జరిగిందా? అని సునీత ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. వీళ్లను రక్షించే పనిలో జగన్ ఉన్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని... వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వేయవద్దని సునీత పిలుపునిచ్చారు.
ఈ కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డికి శిక్ష పడాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత వాళ్లను అంత ఈజీగా అనుమానించలేమని... అందుకే హత్య జరిగిన తర్వాత జగన్ ను కలిసినప్పుడు ఆయనపై తనకు అనుమానం రాలేదని చెప్పారు. ఆ తర్వాత ఒక్కో విషయం అర్థమవుతూ వచ్చిందని అన్నారు. ఈ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఆయనను కూడా విచారించాలని అన్నారు. ఈ హత్యలో జగన్ పాత్రపై కూడా విచారణ జరగాలని చెప్పారు.
వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళ్తుందని సునీత ప్రశ్నించారు. ఇలాంటి నేరాలు ఆగిపోవాలంటే నిందితులకు శిక్షలు పడాల్సిందేనని చెప్పారు. జగన్ మీద 11 కేసులు ఉన్నాయని... ఆ కేసుల మాదిరే వివేకా హత్య కేసు కూడా కాకూడదని అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే... తన తండ్రికి న్యాయం జరగదని చెప్పారు. జగన్ మళ్లీ సీఎం అయితే కష్టాలు మరింత ఎక్కువవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో తనకు న్యాయం జరగాలని అన్నారు. నాన్న హత్యలో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని... అవినాశ్ కు శిక్ష పడాల్సిందేనని చెప్పారు.
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుకు వెళదామని జగన్ ని అడిగానని... సీబీఐకి వెళ్తే అవినాశ్ బీజేపీలోకి వెళ్తాడని జగన్ చెప్పారని సునీత తెలిపారు. దీంతో, తానే వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేశానని చెప్పారు. సీబీఐని కలిసిన తర్వాత తనకు, తన భర్తకు వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. అనుమానితులందరినీ సీబీఐ విచారించాల్సిందేనని చెప్పారు. తనను, తన భర్తను కూడా అనుమానితులుగానే సీబీఐ విచారించిందని తెలిపారు. తనను విచారించినట్టే ప్రతి ఒక్కరినీ విచారించాలని అన్నారు.
(The above story first appeared on LatestLY on Mar 01, 2024 03:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

