Andhra Pradesh: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు, భార్య కాపురానికి రాలేదని కృష్ణానదిలో దూకిన చిత్తూరు జిల్లా యువకుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తాడేపల్లి వద్ద కృష్ణానదిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. భార్య తనను వదిలి వెళ్లడం.. ఇంటికి రానని చెప్పడంతో అతను ఆత్మహత్య (Young man commits suicide) చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
Amaravati, Feb 8: తాడేపల్లి వద్ద కృష్ణానదిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. భార్య తనను వదిలి వెళ్లడం.. ఇంటికి రానని చెప్పడంతో అతను ఆత్మహత్య (Young man commits suicide) చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎస్‌ఐ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం పుణ్యసముద్రం గ్రామానికి చెందిన బత్తయ్య, హేమవతి ఏకైక కుమారుడు వలజపేట బాలాజీ హోటల్ మేనేజ్‌మెంట్ చేసి తమిళనాడులో ఓ హోటల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండున్నర సంవత్సరాల క్రితం చెన్నై నుంచి ఇంటికి వచ్చిన బాలాజీ విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు.. ఆ తరువాత ఇంటికి రాకుండా తండ్రితో ఫోన్ లోనే మాట్లాడేవాడు. కాగా ఈ యువకుని తల్లి చనిపోయింది.
అయితే వైజాగ్‌లో ఓ హోటల్‌లో పనిచేస్తున్నప్పుడు తాడిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికను ప్రేమించి, ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కొద్ది రోజులకు ఆ బాలికను తీసుకుని విజయవాడ వచ్చేశాడు. విజయవాడ వచ్చినప్పటి నుంచి ఆ బాలికను అనుమానించేవాడు. పలుసార్లు బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌లో కూడా ఒకసారి పంచాయితీ జరిగింది. అలాగూ విజయవాడ ఆటోనగర్ పోలీస్‌స్టేషన్‌లోనూ ఇదే పంచాయితీ జరిగింది.
చివరకు ఆ బాలిక విసిగిపోయి అజిత్‌సింగ్‌నగర్‌లోని బంధువుల ఇంట్లో ఉంటుండగా, గత ఏడాది డిసెంబర్ 22వ తేదీన ఆ బాలిక నివాసం ఉంటున్న బిల్డింగ్‌పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు బాలాజీని అదుపులోకి తీసుకొని ఆ బాలికను పిలిచి విచారించగా, తనకు ఇష్టం లేదని చెప్పడంతో తల్లిదండ్రులు సైతం తమకు కేసు ఏమీ వద్దని చెప్పారు. దీంతో బాలాజీని ఎటువంటి కేసు లేకుండా పోలీసులు వదిలేశారు.
ఈ క్రమంలో బాలాజీ శనివారం రాత్రి తాడేపల్లి సమీపంలో ప్రకాశం బ్యారేజీ 10వ ఖానా వద్ద కృష్ణానదిలోకి (Krishna River in Vijayawada) దూకాడు. ఈ క్రమంలో గేటుపై పడటంతో తల వెనుక భాగం, ఎదుటి భాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. గేటు కింద మృతదేహం పడిపోయింది. ఆ మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి బత్తయ్యకు సమాచారం ఇచ్చామని, ఆయన వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్‌ఐ నారాయణ తెలిపారు.
(The above story first appeared on LatestLY on Feb 08, 2021 04:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

