Hidden Cameras in College Girls' Washroom: విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై జగన్ ఆగ్రహం, విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపాటు
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు.
Vjy, August 30: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. చంద్రబాబు ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి’ అంటూ కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు.
‘చంద్రబాబుగారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి.ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గాలికొదిలేశారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు.
మరోవైపు గుడ్లవల్లేరు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేసే ఘటన ఇది. చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన సీఎం.. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై ఆరా తీశారు. వర్షంలో తడుస్తూనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ అంటూ ధర్నా చేశారు. ఏమీ జరగలేదంటూ ఎస్పీ చేసిన ప్రకటనపై ఉపాద్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.పవన్ కళ్యాణ్ బయటకి వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 30, 2024 09:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

