New Agriculture Policy: ప్రజల ఆహార అవసరాలకు సరిపోయే, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించాలి! ఏ పంటలు సాగుచేస్తే రైతులకు లాభమో మే 5 లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

రైతులంతా ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు సాగు చేయాలి. అలా అయితేనే అన్ని పంటలకు డిమాండ్ వస్తుంది. రైతులు తక్కువ శ్రమ, ఎక్కువ దిగుబడి, మార్కెట్ అవకాశాలు, మంచి ఆదాయం పొందగలిగిన పంటలను గుర్తించాలి. వాటిని రైతులకు సూచించాలి.....

New Agriculture Policy: ప్రజల ఆహార అవసరాలకు సరిపోయే, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించాలి!  ఏ పంటలు సాగుచేస్తే రైతులకు లాభమో మే 5 లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
File image of Telangana CM KCR | File Photo

Hyderabad, April 30: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలకు తగినట్లు, మార్కెట్ లో డిమాండు కలిగిన పంటలను సాగు చేసేటట్టు రైతులకు మార్గదర్శకం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వరి మాత్రమే కాకుండా ఇంకా ఏ పంటలు సాగు చేయడం వల్ల రైతులకు మేలు కలుగుతుందో అధ్యయనం చేసి మే 5లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. వరిలో సన్న రకాలను ఎక్కువగా సాగు చేసే విధంగా రైతులను చైతన్య పరచాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించే గోదాముల్లో తప్పకుండా కోల్డ్ స్టోరేజిని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో నూతన వ్యవసాయ విధానం రూపకల్పనపై ముఖ్యమంత్రి వరుసగా రెండోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ సహా అనుబంధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

‘‘తెలంగాణలో గతంలో ప్రాజెక్టులు, కరెంటు సరిగా లేకపోవడం వల్ల సాగునీటి లభ్యత అంతగా లేదు. ప్రభుత్వాలు కూడా వ్యవసాయాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో రైతులు ఎవరికి తోచినట్లు వారు వారి వనరులకు అనుగుణంగా పంటసాగు చేశారు. అందరూ ఒకే పంట వేయడం వల్ల ధరలు కూడా రాలేదు. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మారుతున్నది. ప్రతీ మూలకూ సాగునీరు అందుతున్నది. 24 గంటల కరెంటు వల్ల బోర్ల ద్వారా కూడా జోరుగా వ్యవసాయం సాగుతున్నది. కాబట్టి రైతులను సరిగ్గా నిర్ధేశించగలిగితే లాభదాయక వ్యవసాయం చేస్తారు. పంటల ఎంపికలో, సాగు పద్ధతుల్లో, ఎరువుల వాడకంలో, మార్కెటింగులో మార్పులు వస్తాయి. ఈ దిశగా రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉంది’’ అని సీఎం కేసీఆర్ అభిలషించారు. తెలంగాణ రాష్ట్రం 'రైస్ బౌల్ ఆఫ్ ఇండియా' గా మారుతోంది

‘‘రాష్ట్రంలో ఎక్కువగా వరి పండిస్తున్నారు. పంటకాలం తక్కువనే కారణంతో దొడ్డు రకాలు పండిస్తున్నారు. కానీ ఎక్కువ మంది జనం సన్నరకాలు తింటున్నారు. సన్నరకాలకు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు సాగునీటి వసతి కూడా ఉంది కాబట్టి రైతులు ఎక్కువగా సన్నరకాలు పండించే విధంగా చైతన్య పరచాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘రైతులంతా ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు సాగు చేయాలి. అలా అయితేనే అన్ని పంటలకు డిమాండ్ వస్తుంది. రైతులు తక్కువ శ్రమ, ఎక్కువ దిగుబడి, మార్కెట్ అవకాశాలు, మంచి ఆదాయం పొందగలిగిన పంటలను గుర్తించాలి. వాటిని రైతులకు సూచించాలి. ఏ రైతు ఏ పంట వేయాలో నిర్ణయించి, సాగు చేయించాలి. వేరుశనగ, కందులు, పామాయిల్ లాంటి వాటికి మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇంకా ఇలాంటి డిమాండ్ కలిగిన పంటలను గుర్తించాలి. వాటిని ఎన్ని ఎకరాల్లో పండించాలి? అనే విషయం తేల్చాలి. తెలంగాణ రాష్ట్రంలో కూరగాయలు, పండ్లకు కూడా కొరత ఉంది. అవి ఏ మోతాదులో పండించాలి అనే విషయంపై కూడా అధ్యయనం జరగాలి. నీటి వసతి పెరిగినందున ఫిష్ కల్చర్ ను కూడా తెలంగాణలో విస్తరించవచ్చా? అనే విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎరువుల వాడకం ఇప్పటిలాగానే ఉండాలా? ఏమైనా మార్పులు అవసరమా? అనే విషయాలను కూడా పరిశీలించాలి. పూర్తి స్థాయి అధ్యయనం చేసి మే 5లోగా నివేదిక ఇవ్వాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలో మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించాలని నిర్ణయించినందున వెంటనే స్థలాలను గుర్తించాలని అధికారులను సీఎం కోరారు. కొత్తగా నిర్మించే గోదాముల్లో కోల్డ్ స్టోరేజ్ సదుపాయం కల్పించాలని చెప్పారు.

(The above story first appeared on LatestLY on Apr 30, 2020 09:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).