Delhi Liquor Scam Case: నవంబర్, డిసెంబర్‌లో తెలంగాణ ఎన్నికలు, కీలక వ్యాఖ్యలు చేసిన కవిత, ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొంటానని వెల్లడి
ఈడీ విచారణకు రెండు రోజుల సమయం అడిగాము. మాకు రెండు రోజుల సమయం ఇస్తే ఈడీకి వచ్చిన నష్టమేంటి?. మా ఇంటికి వచ్చి విచారణ చేయాలని ఈడీని రిక్వెట్ చేశాం. కానీ, ఈడీ దీనికి అంగీకరించలేదు. ఈడీ( ED Notice ) విచారణకు వంద శాతం సహకరిస్తాను..
New Delhi, Mar 8: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam Case) ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 11వ తేదీన ఈడీ ఎదుట విచారణకు కవిత హాజరు కానుంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ విచారణకు రెండు రోజుల సమయం అడిగాము. మాకు రెండు రోజుల సమయం ఇస్తే ఈడీకి వచ్చిన నష్టమేంటి?. మా ఇంటికి వచ్చి విచారణ చేయాలని ఈడీని రిక్వెట్ చేశాం. కానీ, ఈడీ దీనికి అంగీకరించలేదు. ఈడీ( ED Notice ) విచారణకు వంద శాతం సహకరిస్తాను.. తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) స్పష్టం చేశారు
మహిళలను ఇంట్లో విచారించాలని చట్టం చెబుతోంది. ఇది నా ఒక్కరి సమస్య కాదు. ఈడీ ఎందుకింత హడావిడీగా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదు. ఈడీ దర్యాప్తునకు వంద శాతం సహకరిస్తాం. దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించే పద్దతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఉద్యమం చేసి వచ్చాం.. భయపడే వాళ్లం కాదు. ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటాం. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయరు అని ప్రశ్నించారు.
200 మంది ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. బీఆర్‌ఎస్‌కు సంబంధించిన నేతల ఇళ్లలో కూడా దాడులు జరిగాయి. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి. మేము భయపడే వాళ్లం కాదు. దేశంలో మోదీ-అదానీ డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. మోదీకి అదానీ బినామీ అని పిల్లోడిని అడిగినా చెబుతాడు. తెలంగాణ నేతలను వేధించడం కేంద్రానికి అలవాలటైపోయింది. మోదీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే కేంద్రం ఈడీ దాడులు చేస్తోంది. విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వండి.
అధికారంలో లేని రాష్ట్రాల్లో మోదీ కంటే ముందు ఈడీ వస్తోంది. గాంధీ పుట్టిన దేశంలో అబద్ధం రాజ్యమేలుతోంది. ప్రధాని మోదీ బయటే కాదు పార్లమెంట్‌లోనూ అబద్ధాలు చెప్తున్నారు. ధర్మం ఎటువైపు ఉంటే వాళ్లదే విజయం. జైలులో పెట్టినంత మాత్రాన కృష్ణుడు జన్మించడం ఆగలేదు. అజ్ఞాతవాసం తర్వాత అర్జునుడు విజయం సాధించాడు. ఈడీ ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతాను. మేము బీజేపీ బీ టీమ్ అయితే.. ఈడీ ఆఫీసుకు ఎందుకు వెళ్తున్నాము. నాతో పాటు ఎవరిని విచారించినా నాకేం ఇబ్బంది లేదు.
మహిళా బిల్లు కోసం 27 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఇంతవరకు పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందలేదు. బిల్లుపై ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోలేకపోయాయి. అందుకే రేపు ఢిల్లీలో ధర్నా చేపడుతున్నాం. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాలో మొత్తం 18 పొలిటికల్ పార్టీలు పాల్గొంటాయి అని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్( BL Santosh ) సిట్( SIT ) ముందుకు ఎందుకు రావడం లేదు. సిట్ ముందుకు వచ్చేందుకు బీఎల్ సంతోష్‌కు భయమెందుకు..? అని కవిత ప్రశ్నించారు. బీజేపీ నేతలు, బీజేపీలో చేరిన నేతలపై ఈడీ, సీబీఐ కేసులు ఉండవు. బీజేపీని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు, కేసులు పెడుతారు. తమ వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉంది. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం అని కవిత తేల్చిచెప్పారు.
మోదీ వన్ నేషన్.. వన్ ఫ్రెండ్ స్కీమ్ అమలు చేస్తున్నారు అని కవిత మండిపడ్డారు. బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అవుతుంది. మహిళా బిల్లు ఆందోళన అనగానే తనకు ఈడీ నోటీసులు ఇచ్చారు. వంట గ్యాస్ ధరలపై మరొకరు గళమెత్తితే వాళ్లకు కూడా ఈడీ నోటీసులు ఇస్తారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలను పంపుతున్నారు అని కవిత ధ్వజమెత్తారు.
నవంబర్, డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు రావొచ్చు అని కవిత పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానం. తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేయడమే బీజేపీ లక్ష్యం. తమ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేంద్రం లక్ష్యంగా చేసుకుంది. దర్యాప్తు సంస్థలతో తమపై దాడులు చేయిస్తోంది. ఈడీ, సీబీఐ, ఐటీ బెదిరింపులకు పాల్పడుతోంది అని కవిత తెలిపారు.
(The above story first appeared on LatestLY on Mar 09, 2023 02:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

