Delta Plus AY-12 Variant: తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకరంగా మారిన ఏవై.12 రకం కరోనా, ఏపీలో 18, తెలంగాణలో 15 కేసులు నమోదు, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 178 కేసులు వెలుగులోకి
తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు ‘ఏవై.12’ రకం కరోనా వేరియంట్ (Delta Plus AY-12 variant) ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతికి కారణమైన డెల్టా ప్లస్ వేరియంట్‌లో ఇది ఉపరకం. ఇది శరవేగంగా వ్యాప్తి చెందడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
Hyderabad, Sep 5: తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు ‘ఏవై.12’ రకం కరోనా వేరియంట్ (Delta Plus AY-12 variant) ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతికి కారణమైన డెల్టా ప్లస్ వేరియంట్‌లో ఇది ఉపరకం. ఇది శరవేగంగా వ్యాప్తి చెందడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వేరియంట్ (Delta variant sub-lineage AY.12) గత నెల 30న ఉత్తరాఖండ్‌లో వెలుగు చూడగా, వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు పాకింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 178 కేసులు నమోదు కాగా, ఏపీలో 18, తెలంగాణలో 15 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోని వికారాబాద్‌లో 9, వరంగల్‌లో నాలుగు, హైదరాబాద్‌లో 2 కేసులు వెలుగు చూశాయి. కేసుల విషయంలో ఉత్తరాఖండ్‌తో కలిసి ఏపీ మూడో స్థానంలో ఉంది.
డెల్టాప్లస్ వేరియంట్‌కు సంబంధించి తమ వద్ద ఉన్న నమూనాలను మళ్లీ పరీక్షించిన సీసీఎంబీ.. వైరస్ వ్యాప్తి వేగం పెరుగుతున్నట్టు గుర్తించింది. ఊపిరితిత్తుల కణాల్లో అది బలంగా అతుక్కుపోతోందని, మోనోక్లోనల్ యాంటీబాడీ స్పందనను అది తగ్గిస్తోందని గుర్తించారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణ కార్యకలాపాలు మళ్లీ పెరుగుతుండడంతో వ్యాధి సంక్రమణ అవకాశాలు మళ్లీ పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు, ఏప్రిల్ నుంచి దేశంలో డెల్టా వైరస్ కేసులు కూడా పెరుగుతున్నట్టు చెబుతున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్‌లో పుట్టుకొచ్చిన ఉప రకాలను ఏవై.1, ఏవై.2, ఏవై.3.. వంటి పేర్లతో పిలుస్తున్నారు. ఏవై.12 వేరియంట్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు బయటపడడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహూజా అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. డెల్టా ఉత్పరివర్తనానికి సాంక్రమికత ఎక్కువని, మనుషుల శరీరంలోని కణజాలానికి (హోస్ట్‌సెల్) బలంగా అతుక్కునే లక్షణం దీనికి ఉంటుందని పరిశోధనా సంస్థ ఇన్సాకాగ్ పేర్కొన్నట్లు తెలిపారు.
రాష్ట్రాలవారీగా డెల్టా ప్లస్, ఏవై.12 కేసుల నమోదు వివరాలు
డెల్టా ప్లస్
తెలంగాణ-52, మహారాష్ట్ర-47, గోవా-45, జమ్ముకశ్మీర్-41, ఉత్తరాఖండ్-27, ఏపీ-24, పంజాబ్-20, బిహార్-19, హిమాచల్‌ప్రదేశ్-19, చండీగఢ్-18, మధ్యప్రదేశ్-18, దిల్లీ-10, రాజస్థాన్-9, మణిపుర్-8, అస్సాం-5, తమిళనాడు-4, కర్ణాటక-4, మేఘాలయ-3, ఉత్తర్‌ప్రదేశ్-2, పశ్చిమబెంగాల్-2, గుజరాత్-2, హరియాణా-2, నాగాలాండ్-1, ఒడిశా-1.
ఏవై.12
గోవా-34, మహారాష్ట్ర-20, ఆంధ్రప్రదేశ్-18, ఉత్తరాఖండ్-18, జమ్ముకశ్మీర్-16, తెలంగాణ-15, చండీగఢ్-10, పంజాబ్-8, రాజస్థాన్-8, హిమాచల్‌ప్రదేశ్-8, బిహార్-6, దిల్లీ-6, మధ్యప్రదేశ్-5, మణిపుర్-3, మేఘాలయ-3.
(The above story first appeared on LatestLY on Sep 05, 2021 10:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

