Eco-Friendly Electric Buses: హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టనున్న1300 పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు, ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ప్రత్యేకతలివే

హైదరాబాద్ ప్రయాణికులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని #TSRTC నిర్ణయించింది.

Eco-Friendly Electric Buses: హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టనున్న1300  పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు, ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ప్రత్యేకతలివే
Eco-friendly electric buses (Photo-Twitter.VC Sajjanar)

హైదరాబాద్ ప్రయాణికులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని #TSRTC నిర్ణయించింది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతుంది. త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తెచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.

హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, భారీ వాహనం కిందపడి తృటిలో చావు నుండి తప్పించుకున్న బైక్ రైడర్, వీడియో ఇదిగో..

“హైదరాబాద్ లో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే సంస్థ అందుబాటులోకి తీసుకురాబోతుంది. అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్‌ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే విజయవాడ రూట్ లో 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్ లో తొలి దశలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయి.

షాకింగ్ వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్, మద్యం మత్తులో వాహనాలు నడిపి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చవద్దంటూ క్యాప్షన్

వాటిలో 20 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరుగుతాయి. మరో 30 ఐటీ కారిడార్ లో నడుస్తాయి. వాటిలో 25 బస్సులను త్వరలోనే ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ ఆర్థిక ఏడాదిలో సిటీలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి వస్తున్నాయి.

Here's TSRTC MD Tweet

అందులో 50 ఏసీ బస్సులుండగా.. మిగతావి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో విడతల వారీగా ఈ బస్సులను టీఎస్‌ఆర్టీసీకి ఒలెక్ట్రా అందజేయనుంది. వీటికి తోడు సిటీలో మరో 800 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియ ప్రాసెస్ లో ఉంది.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకటేశ్వర్లు, కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథ రావు, సీఈఐటీ రాజశేఖర్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) వేణుగోపాల్‌ రావు, మేనేజర్ ఆనంద్‌ బసోలి, అసిస్టెంట్ మేనేజర్ యతిష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

*ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ప్రత్యేకతలివే!*

12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు సీటు బెల్ట్ సదుపాయం ఉంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా కూడా ఉంటుంది.

గమ్యస్థానాల వివరాలు కోసం బస్సులో నాలుగు ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఫుల్ చార్జింగ్ కు 2 నుంచి 3 గంటలకు సమయం పడుతుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు.

(The above story first appeared on LatestLY on Aug 07, 2023 07:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).