HYDRA: అక్రమార్కుల గుండెల్లో వణుకుపుట్టిస్తున్న హైడ్రా, 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్ నగరంలో హైడ్రా అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలను కబ్జా చేసిన వారిపై కన్నెర్ర చేస్తూ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఈక్రమంలో జూన్‌ 27 నుంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతలకు సంబంధించిన నివేదికను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్రభుత్వానికి సమర్పించారు.

HYDRA: అక్రమార్కుల గుండెల్లో వణుకుపుట్టిస్తున్న హైడ్రా, 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు ప్రభుత్వానికి నివేదిక
hydra commissioner ranganath comments on n convention demolition (photo-X)

Hyd, August 25: హైదరాబాద్ నగరంలో హైడ్రా అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలను కబ్జా చేసిన వారిపై కన్నెర్ర చేస్తూ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఈక్రమంలో జూన్‌ 27 నుంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతలకు సంబంధించిన నివేదికను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా వెల్లడించింది. తద్వారా కబ్జాదారుల నుంచి 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది.

గత కొన్ని రోజులుగా హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటోంది. హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి హైడ్రా శనివారం కూల్చేసింది. అయితే కూల్చివేతలు పూర్తయ్యాక హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా హైడ్రా పేరు మార్మోగిపోయింది.  ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, చట్టప్రకారమే కూల్చివేతలని కామెంట్,కేటీఆర్ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ ఎంపీ

తాజాగా చెరువులు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. భాగ్యనగరంలో మొత్తంగా 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా తన నివేదికలో స్పష్టం చేసింది. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్రెడ్డికి చెందిన నిర్మాణాలు నేలమట్టం చేసినట్లు వివరించింది. కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమకు చెందిన కట్టడాలను కూల్చివేసినట్లు రిపోర్ట్ లో పేర్కొంది. లోటస్పాండ్, బంజారాహిల్స్, బీజేఆర్నగర్, గాజులరామారం, మన్సూరాబాద్, అమీర్పేట్ ఏరియాలలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపింది.

చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లతో పాటు పార్కు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఉన్నట్టు హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. చింతల్ చెరువులో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు రత్నాకరం సాయిరాజు అక్రమంగా నిర్మించిన 54 నిర్మాణాలను కూల్చివేసి 3 ఎకరాల 5 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

అలాగే నందగిరి హిల్స్‌కు సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుతో ఆక్రమించిన పార్క్ స్థలంలోని 18 గుంటల భూమిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. బహదూర్ పురా ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మిరాజ్ రెహమత్ బేగ్ రాజేంద్రనగర్‌లోని బుమురౌఖ్‌ దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన రెండు ఐదంతస్తుల భవనాలు, ఒకటి రెండంతస్తుల భవనంతోపాటు మరో భవనాన్ని కూల్చివేశామని స్పష్టం చేసింది. ఇక్కడ మొత్తం 45 అక్రమ నిర్మాణాలు కూల్చివేసి 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు తెలిపింది.

గండిపేట ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ఖానాపూర్, చిలుకూరు వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరి సీడ్స్ యజమాని జీవీ భాస్కర్ రావు, మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రోకబడ్డి యజమాని అనుపమ ఆక్రమంగా నిర్మించిన 8 భవనాలు, 14 తాత్కాలిక షెడ్లు, 4 ప్రహారీలను కూల్చివేసినట్లు వివరించింది.

ఖానాపూర్, చిలుకూరు వద్ద గండిపేట ఎఫ్‌టీఎల్‌లోని 14 ఎకరాల 80 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించిన రెండు నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా తెలిపింది. ఇక్కడ 4 ఎకరాల 9 గుంటల భూమి స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా పేర్కొంది.

ఫిల్మ్‌నగర్‌ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేసి 16 గుంటలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. మన్సూరాబాద్‌లో 2 గుంటలు, ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో 6 గుంటలు, బంజారాహిల్స్ మిథిలా నగర్‌లో ఎకరా 4 గుంటలు, ఫిల్మ్ నగర్‌లోని బీజేఆర్ నగర్‌లో నాలాపై అక్రమంగా నిర్మించిన స్లాబ్ ను కూల్చి వేసి 5 ఎకరాలు, గాజులరామారం మహాదేవపురం వద్ద ఒక గుంట, గాజుల రామారావు భూదేవిహిల్స్‌లో ఎకరం ఒక గుంట, అమీర్‌పేటలో గుంట, చందానగర్ ఈర్ల చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న మూడంతస్తుల భవనం ఒకటి, నాలుగు అంతస్తుల భవనం రెండింటిని కూల్చివేసి 16 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది. బాచుపల్లి ఎర్రకుంటలో 29 గుంటలు, బోడుప్పల్‌ రెవెన్యూ భూమిలో 3 గుంటలు స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

(The above story first appeared on LatestLY on Aug 25, 2024 07:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).