Harish Rao Counter To Congress: కాంగ్రెస్‌వి వారెంటీ లేని గ్యారెంటీలు, వందరోజుల్లోనే కర్ణాటక ఆగమాగం అవుతోంది, కాంగ్రెస్ గ్యారెంటీలపై హరీష్ రావు ఘాటు కౌంటర్
కర్నాటకలో మీరు ఇట్లానే ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయలేక వంద రోజుల్లోనే ఆగం ఆగం అవుతున్నారన్నారు. కరెంటు లేదని రైతులు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని, అక్కడ మీరిచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా..? అంటూ నిలదీశారు
Hyderabad, SEP 17: కాంగ్రెస్ గ్యారెంటీలపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (Harish rao) విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ (COngress) ఇచ్చింది వారెంటీలు లేని గ్యారెంటీలు అంటూ సెటైర్లు వేశారు. కర్నాటకలో మీరు ఇట్లానే ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయలేక వంద రోజుల్లోనే ఆగం ఆగం అవుతున్నారన్నారు. కరెంటు లేదని రైతులు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని, అక్కడ మీరిచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా..? అంటూ నిలదీశారు. ఏరుదాటక తెప్ప తగలబెట్టేరకం అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో ఇచ్చినట్టు మీరు దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలు ఇస్తారా..? ఎందుకు చెప్పలేకపోతున్నారు ? అంటూ నిలదీశారు. ఎన్నికలప్పుడు వచ్చుడు.. నోటికి వచ్చింది చెప్పుడే తప్ప మీరు ఇచ్చే గ్యారెంటీలను అమలు చేసేది ఎవరు?.. 2014లో కాంగ్రెస్ ఇట్లనే భూటకపు హామీలు ఇస్తే 44 ఎంపీ సీట్లు వచ్చినయ్.. 2019లో 52 వచ్చినయ్ అంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) అజ్ఞానానికి జోహార్ అన్న హరీశ్‌రావు.. రాష్ట్రపతి ఎన్నికల్లో మేం బీజేపీకి మద్దతు ఇవ్వలేదన్నారు. కావాలంటే మీరు పేపర్లు తిరగేసి చూడాలన్నారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చామని.. బాజాప్తా ఆయనకు మా పార్టీ ఓటేసిందన్నారు. తెలంగాణకు యశ్వంత్ సిన్హాను పిలిచి భారీ సభ పెట్టామని.. మీ నేతలనే అడిగి అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ తాము బీజేపీకి మద్దతు ఇవ్వలేదన్నారు. జీఎస్టీ బిల్లును తెచ్చిందే కాంగ్రెస్.. కాంగ్రెస్ జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇవ్వడంలేదా..? అంటూ నిలదీశారు.
అలవికాని హామీలు, అబద్ధాల ఆరోపణలు, చరిత్ర వక్రీకరణలు.. కాంగ్రెస్ సభ సాంతం ఆత్మవంచన, పరనిందగా సాగింది.
• కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అసలు కాంగ్రెస్ కు ఓట్లు పడతాయనే గ్యారంటే లేదు.
• గాలికి పోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ…
— Harish Rao Thanneeru (@BRSHarish) September 17, 2023
మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జీఎస్టీ ఉన్నదా..? లేదా..? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు..? ఎందుకీ నయవంచక ముచ్చట్లు.. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలియదా..? అంటూ ఘాటుగానే స్పందించారు. గుజరాత్ ఎన్నికలప్పుడు జోడో యాత్ర గుజరాత్‌కు ఎందుకు వెళ్లలేదు..? మా దగ్గర హుజురాబాద్, మునుగోడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నేరుగా.. సిగ్గులేకుండా బీజేపీకి సపోర్టు చేయడం మీకు తెలియదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐలు వేటకుక్కల్లా మా నేతలను వేధిస్తున్నా మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మా మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఎల్ రమణ, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి తదితరులపై బీజేపీ ఈడీ, సీబీఐల పేరుతో వేధించినది మీకు కనిపిస్తలేదా..? అంటూ మండిపడ్డారు.
కర్ణాటకలో ఒక్క హామీ కూడా నెరవేర్చక కాంగ్రెస్ అసలు స్వరూపం బయటపెట్టింది
•కాంగ్రెస్ గత చరిత్ర ప్రజలకు తెలుసు
•సోనియా, రాహుల్ లు ఎం చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేదు
: సూర్యాపేట లో మీడియా తో మాట్లాడిన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు @BRSparty @KTRBRS… pic.twitter.com/rU4VwU9y8F
— Jagadish Reddy G (@jagadishBRS) September 17, 2023
కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి చెప్పాలంటే.. వేలున్నాయని, స్కాంల సంస్కృతిని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అని.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ అంటూ విమర్శించారు. బోఫోర్స్ నుంచి దాణా, చక్కెర కుంభకోణాలు ఒకటా.. రెండా.. దేశంలో అవినీతికి కేరాఫ్ అడ్రెస్సే కాంగ్రెసేనన్నారు. ఏ కోణంలో చూసినా కాంగ్రెస్‌లో కుంభకోణమే కనిపిస్తుందని, అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడితే తోడేలు శాకాహారం గురించి మాట్లాడినట్టు ఉంటదన్నారు. తెలంగాణ ఎవరి దయతోనూ రాలేదని, ప్రజలు పోరాడి గెలుచుకున్నరని, మీరు దయతో ఇచ్చి ఉంటే వందలాది మంది యువకులు ఎందుకు బలిదానం చేసుకున్నారని నిలదీశారు.
(The above story first appeared on LatestLY on Sep 17, 2023 10:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

