COVID in TS: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం, 2 వేలు దాటిన రోజూవారీ పాజిటివ్ కేసుల సంఖ్య, కోవిడ్ కట్టడి చర్యల కోసం కేంద్ర సహాయం కోరనున్న టీఎస్ ప్రభుత్వం, రాష్ట్రంలో లాక్డౌన్ ఉండబోదని మరోసారి స్పష్టీకరణ

మహారాష్ట్రతో తెలంగాణ రాష్ట్రం పొడవైన సరిహద్దును కలిగి ఉండటం అలాగే, కాస్మోపాలిటన్ నగరమైన హైదరాబాద్‌కు వివిధ ప్రదేశాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండటం మూలానా కేసులు పెరుగుతున్నాయని మంత్రి వివరించారు. ప్రజలు వైరస్ వ్యాప్తి చెందకుండా, ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం సహా ఇతర కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.....

COVID in TS: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం, 2 వేలు దాటిన రోజూవారీ పాజిటివ్ కేసుల సంఖ్య, కోవిడ్ కట్టడి చర్యల కోసం కేంద్ర సహాయం కోరనున్న టీఎస్ ప్రభుత్వం, రాష్ట్రంలో లాక్డౌన్ ఉండబోదని మరోసారి స్పష్టీకరణ
Representational Image | (Photo Credits: PTI)

Hyderabad, April 8: తెలంగాణలో సెకండ్ వేవ్  కోవిడ్ అంతకంతకూ విస్తరిస్తోంది, గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా ప్రతీచోట కొత్త కేసులు భారీగా బయటపడుతున్నాయి. అయితే ఇప్పటికీ దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చిచూస్తే తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్ పేర్కొన్నారు. మహారాష్ట్రతో తెలంగాణ రాష్ట్రం పొడవైన సరిహద్దును కలిగి ఉండటం అలాగే, కాస్మోపాలిటన్ నగరమైన హైదరాబాద్‌కు వివిధ ప్రదేశాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండటం మూలానా కేసులు పెరుగుతున్నాయని మంత్రి వివరించారు. ప్రజలు వైరస్ వ్యాప్తి చెందకుండా, ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం సహా ఇతర కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. తెలంగాణలో లాక్డౌన్ గానీ, కర్ఫ్యూలు గానీ ఉండబోవని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 87,332 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2055 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 4,457 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,18,704కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 398 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 214 కేసులు, రంగారెడ్డి నుంచి 174, నిజామాబాద్ నుంచి 169 మరియు నిర్మల్ నుంచి 100 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 7 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,741కు పెరిగింది.

అలాగే బుధవారం సాయంత్రం వరకు మరో 303 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,03,601 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,362 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 45 ఏళ్లు పైబడిన పౌరులకు టీకాల పంపిణీ జరుగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 16 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది. సెకండ్ వేవ్ కోవిడ్ నివారణ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సహాయం కోరనున్నట్లు సమాచారం. గురువారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కోవిడ్ నివారణ చర్యల కోసం సరిపడా వ్యాక్సిన్, చికిత్స కోసం అవసరమయ్యే మందులు, ఇతర వైద్య పరికరాలు మొదలగునవి సీఎం కేసీఆర్ ప్రధానిని కోరే అవకాశం ఉంది.

(The above story first appeared on LatestLY on Apr 08, 2021 09:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).