Telugu States Weather Update: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఉదయం నుంచే మంట పుట్టిస్తున్న సూర్యుడి భగభగలు రెండు రాష్ట్రాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి.సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి
Hyd, April 19: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఉదయం నుంచే మంట పుట్టిస్తున్న సూర్యుడి భగభగలు రెండు రాష్ట్రాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి.సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. గురువారం తెలంగాణలోని మంచిర్యాల జిల్లా హాజిపూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇక ఏపీలో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేట, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడల్లో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్ సహా తెలంగాణలో ఈరోజు, రేపు మండిపోనున్న ఎండలు
తెలంగాణలోని నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో కూడా గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీ ల సెల్సియస్, ములుగు జిల్లా మేడారంలో 45.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది.గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 43.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.6 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కాగా, భద్రాచలం, నల్లగొండలో 4 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, మెదక్, హనుమకొండ, నిజామాబాద్, రామగుండంలో 3 డిగ్రీల సెల్సియస్ మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల సెల్సియస్ మేర సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. Monsoon Rains: రైతులకు చల్లని కబురు.. ఈసారి సమృద్ధిగా వానలు.. సాధారణం కంటే అధిక వర్షపాతం.. ఐఎండీ అంచనా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మస్తు వానలు
రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతా యని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావొద్దని సూచించింది. ఎండల తీవ్రతకు తోడు వడగాల్పుల ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఎండదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇక ఏపీలో గురువారం నందవరం (నంద్యాల)లో 45.6, జామి (విజయనగరం)లో 45.5, కొవిలం (శ్రీకాకుళం), కొంగలవీడు (వైఎస్సార్)ల్లో 45.4, రేణిగుంటలో, దరిమడుగు (ప్రకాశం)లో 45.3, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు 16 జిల్లాల్లో నమోదైనట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.గురువారం 84 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 120 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శుక్రవారం 91 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 245 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం 39 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 215 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయి. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి గురువారం కొమరిన్ ప్రాంతం నుంచి దక్షిణ తెలంగాణ, అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా కొనసాగుతోంది. ఫలితంగా శుక్ర, శనివారాలు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
మన్నార్ గల్ఫ్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం ఉత్తరాది జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
(The above story first appeared on LatestLY on Apr 19, 2024 11:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

