TSPSC (Credits: X)

Hyderabad, May 24: తెలంగాణలో (Telangana) 563 గ్రూప్ – 1 (TGPSC Group-1) కొలువుల భర్తీకి  టీజీపీఎస్సీ (గతంలో టీఎస్‌పీఎస్సీ) ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించడానికి సంసిద్ధం అవుతున్నది. జూన్ 9న ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకూ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు భారీగా 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఓఎంఆర్ (OMR) విధానంలోనే పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. సీబీఆర్‌టీ విధానంలో పలు సెషన్లలో పరీక్షలు నిర్వహించాల్సి వస్తుండటంతో..ఒక్క రోజులోనే పరీక్ష పూర్తి చేసేందుకు వీలుగా ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది.

అమెరికాలో బైక్ ప్రమాదం.. ఏపీ విద్యార్ధి బీలం అచ్యుత్ దుర్మరణం.. విచారం వ్యక్తం చేసిన ఎంబసీ.. మృతదేహాన్ని భారత్‌ కు తరలించేందుకు ఏర్పాట్లు

ప్రిలిమ్స్‌ కు హాజరయ్యే విద్యార్థులకు టీజీపీఎస్సీ ఈ సందర్భంగా కీలక సూచనలు చేసింది.

  • పరీక్షనాడు అభ్యర్థులకు హాల్‌ టిక్కెట్ నంబర్, ఫొటో, పేరు, తండ్రి, తల్లి పేర్లు, పుట్టిన తేదీ, పరీక్ష కేంద్రం, లింగం తదితర వివరాలను ముద్రించిన ఓఎమ్ఆర్ జవాబు పత్రం ఇస్తారు.
  • ఇందులో ఏమైనా పొరపాట్లు దొర్లితే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి, సాదా ఓఎంఆర్ పత్రాన్ని అభ్యర్థులు విధిగా పొందాలి
  • పరీక్ష రాసేముందు ప్రశ్నపత్రం నంబర్ ఓఎంఆర్ షీట్ లో నమోదు చేసి, సర్కిళ్లను జాగ్రత్తగా బబుల్ చేయాలి.
  • ఓఎంఆర్ లో వివరాలు సరిగా బబుల్ చేయకుంటే ఆ జవాబు పత్రాన్ని తిరస్కరిస్తామని కమిషన్ స్పష్టం చేసింది.
  • జవాబు పత్రంలో పేర్కొన్న చోట అభ్యర్థి, ఇన్విజిలేటర్ సంతకం చేయాలి, జవాబులు గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్ పెన్ను ఉపయోగించాలి.
  • పరీక్ష పూర్తయిన తరువాత జవాబు పత్రాలను స్కానింగ్ చేసి, అభ్యర్తుల డిజిటల్ కాపీలు వెబ్‌ సైట్లో పొందుపరుస్తారు.
  • ప్రశ్నపత్రంలో ఇంగ్లిష్ పదాలు, వాక్యాల అర్థం తెలుగులో సరిగా అనువాదం కాకుంటే ఇంగ్లిష్ వర్షన్ కాపీని పరిగణనలోకి తీసుకుంటారు.
  • సమాధానాలు గుర్తించేందుకు, పొరపాట్లు జరగకుండా ప్రాక్టీస్ చేసేందుకు నమూనా ఓఎంఆర్ పత్రాన్ని కమిషన్ వెబ్ సైట్లో పొందుపరిచింది.

బెంగళూరు రేవ్‌ పార్టీ దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు, ఇద్దరు తెలుగు నటీనటులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ

పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు..

  • హాల్ టిక్కెట్ తో పాటు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (పాన్, పాస్ పోర్టు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ) ఒరిజినల్స్ తీసుకెళ్లాలి.
  • అభ్యర్థుల బయోమెట్రిక్ ను ఇన్విజిలేటర్లు పరీక్ష కేంద్రంలో ఉదయం 9.30 నుంచి ప్రారంభిస్తారు. బయోమెట్రిక్ పూర్తయ్యేవరకు అభ్యర్థులెవరూ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లడానికి వీలు లేదు.
  • బయోమెట్రిక్ లో ఫింగర్ ప్రింట్ తీసుకునేందుకు వీలుకాకుంటే.. అభ్యర్థి ఫొటోను తీసుకుని ఇంక్ ప్యాడ్ ద్వారా వేలిముద్రను బయోమెట్రిక్ గా తీసుకుంటారు.
  • అభ్యర్థులు తమ చేతులపై గోరింటాకు, తాత్కాలిక టాటూలు వేసుకోవద్దు.

హాల్ టిక్కెట్లు ఎప్పుడంటే?

హాల్ టిక్కెట్లు జూన్ 1న అందుబాటులోకి వస్తాయి. ప్రిలిమ్స్ లో ప్రతిభ చూపిన వారిని జోన్ల వారీగా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్ఫత్తిలో తీసుకుంటారు. రిజర్వుడ్ వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.