Weather Forecast: మళ్లీ దూసుకొస్తున్న తుపాన్, రెండు మూడు రోజుల్లో మోగా విరుచుకుపడే అవకాశం, రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
VJY, Dec 14: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇదే ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఏపీలో నిన్న కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 92.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి, విశాఖపట్టణం, బాపట్ల సహా పలు జిల్లాల్లో నిన్న వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు భయపెట్టాయి. తుపాను కారణంగా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లోని పంటలు ధ్వంసమయ్యాయి. మరోవైపు, రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరిక జారీ చేసింది.
మాండూస్ తుపాన్త తగ్గిందనే లోపే తెలుగు రాష్ట్రాలకు మోగా తుపాను ముప్పు పొంచివుంది. రెండు రోజుల్లో మోగా తుపాను విరుచుకుపడుతుందని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా పంట నష్టపోయామని, మళ్లీ వర్షాలు పడితే కోలుకోలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత రెండురోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అంతేగాక, హైదరాబాద్ నగరం, ఇతర జిల్లాలు కూడా ముసురుపట్టిన వాతావరణాన్ని అనుభవించాయి.
(The above story first appeared on LatestLY on Dec 14, 2022 01:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

