Wifi at stations (Image: PTI)

రైల్వేశాఖ ముఖ్యమైన స్టేషన్లలో 30 నిమిషాల పాటు ఫ్రీగా వైఫై సర్వీసులు రైల్‌టెల్‌ పేరుతో అందిస్తున్న సంగతి విదితమే. అయితే ఇలా ఫ్రీగా వస్తున్న వైఫైని కొంతమంది యూజర్లు పాడు పనులకు ఉపయోగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 30 స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు (Free Wi-Fi Service) అందుబాటులో ఉన్నాయి. ప్రయాణానికి ముందు స్టేషన్‌కి వచ్చిన వారు తాము ప్రయాణించే రైలు వివరాలు, లైవ్‌ స్టేటస్‌, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, టికెట్‌ బుకింగ్‌ తదితర వివరాలు తెలుసుకునేందుకు, ముఖ్యమైన రీఛార్జ్‌లు చేసుకునేందుకు ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో వీటిని ఈ సర్వీసులు అందిస్తున్నారు. కొంత మందికి కాలక్షేపం అవుతుందని అధికారులు భావించారు.

అయితే రైల్వేస్టేషన్లలో వైఫై సర్వీసులు ఆశించిన స్థాయిలో లేవని ముఖ్యంగా నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉందంటూ తరచుగా రైల్వేకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఫ్రీ వైఫై వినియోగం తీరును సంబంధించిన డేటాను రైల్‌టెల్‌ ఇటీవల విశ్లేషించగా దిమ్మతిరిగే వాస్తవాలు ( Railway Stations Becomes Hub) వెలుగు చూశాయి. రైల్వేశాఖ అంచనాలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నట్టు తాజా వివరాలు చెబుతున్నాయి. ఫ్రీ వైఫైని ఎక్కువ మంది అశ్లీల కంటెంట్‌ చూడటానికి, డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి (Download Porn Videos) వినియోగిస్తున్నట్టు రైల్‌టెల్‌ తెలిపింది.

దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ అలజడి, భారీగా పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 5233 మందికి కరోనా, అత్యధికంగా మహారాష్ట్రలో 1881 కేసులు నమోదు, ఒక్క ముుంబై నుంచే 1242 కేసులు

ఆశ్లీల కంటెంట్‌కు ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోవడంతో కేవలం ఫ్రీగా అందించే 30 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 350 ఎంబీ డేటాను ఖర్చు చేసేస్తున్నారు. ఇలాంటి వారు ఏకకాలంలో పెరిగిపోవడంతో లోడ్‌ ఎక్కువైపోతున్నట్టు గుర్తించారు. ఫ్రీ వైఫై ట్రాఫిక్‌లో అశ్లీల కంటెంట్‌ వాటా ఏకంగా 35 శాతం ఉన్నట్టుగా తేలింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు వెల్లడించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్‌, విజయవాడ, తిరుపతి స్టేషన్లలోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని పేర్కొంది.

ముఖ్యంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ పరధిలో బూతు వీడియోలు రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్‌ అవుతున్నట్టు తేలింది. రైల్‌టెల్‌ అందిస్తున్న ఫ్రీ డేటా పథకం ఎలా పక్కదారి పట్టిందో తెలియడంతో... ఈ బూతుకు అడ్డుకట్ట వేసేందుకు అనేక సైట్లను బ్లాక్‌లిస్టులో పెడుతున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో స్టేషన్లలో రైల్వేశాఖ.. బూతు భాగోతానికి తెరదించేందుకు మరింత పకబ్బంధీ ప్రణాళిక రూపొందించే పనిలో ఉంది .