Mahakumbh Mela 2025: 18వ రోజుకు చేరుకున్న మహా కుంభమేళా, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన 27 కోట్ల మంది భక్తులు, కలవరపెడుతున్న వరుస ప్రమాదాలు

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో జరుగుతున్న మహా కుంభ మేళా (Kumbh Mela) 18వ రోజుకు చేరుకుంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.

Mahakumbh Mela 2025: 18వ రోజుకు చేరుకున్న మహా కుంభమేళా, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన 27 కోట్ల మంది భక్తులు, కలవరపెడుతున్న వరుస ప్రమాదాలు
Maha Kumbh Mela 2025 (Photo-ANI)

Prayagraj, Jan 30: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో జరుగుతున్న మహా కుంభ మేళా (Kumbh Mela) 18వ రోజుకు చేరుకుంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. నేటి వరకు 27 కోట్ల మంది భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

ఈ రోజు ఉదయం 8 గంటల వరకూ దాదాపు 55 లక్షల మంది నదీ స్నానాలు ఆచరించినట్లు తెలిపింది. మరోవైపు కుంభమేళ జరిగే రోజుల్లో మౌని అమావాస్యను భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఈనెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా ఏకంగా 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం తెలిపింది. బుధవారం ఒక్కరోజే 9-10 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నారని అధికారులు ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేలా ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తుంది. ఈ కుంభమేళాలకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్‌ అంచనా వేస్తోంది.

మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. సెక్టార్ 22లో తగలబడుతున్న టెంట్లు, తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఘటన.. వీడియో

మహాకుంభ మేళా (Maha kumbha Mela) లో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తొక్కిసలాట ఘటన మరవకముందే ఈ రోజు మరో ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టర్‌ 22లో ఛత్నాగ్‌ ఝాన్సీ (Chhatnag Jhunsi) ప్రాంతంలో నిర్మించిన టెంట్‌ సిటీలో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డజనుకుపైగా టెంట్లు కాలిపోయాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కుంభమేళా ప్రారంభమైన 18 రోజుల వ్యవధిలోనే అక్కడ అగ్నిప్రమాదం జరగడం ఇది మూడోసారి.తొలుత ఈనెల 19వ తేదీన మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎల్పీజీ సిలిండర్‌ పేలడంతో సెక్టార్‌ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు ఆహుతయ్యాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఆతర్వాత వారం రోజులకే అంటే ఈనెల 25వ తేదీన మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. కుంభమేళాకు వెళ్లే ప్రధాన రహదారిలోని సెక్టార్‌ 2 సమీపంలోని పార్కింగ్‌ ఏరియాలో మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో ఓ కారు పూర్తిగా దగ్ధం కాగా, మరో కారు పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు.ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.ఇక మౌని అమావాస్య సందర్భంగా 29వ తేదీ అంటే బుధవారం సంగమం వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 30 మంది మరణించినట్లు యూపీ పోలీసు అధికారులు ప్రకటించారు. దాదాపు 40 మంది గాయపడ్టట్లు వెల్లడించారు.

ప్రమాదాల నేపథ్యంలో కుంభ‌మేళా జ‌రిగే ప్రాంతాన్ని పూర్తిగా నో వెహికిల్ జోన్‌గా ప్రక‌టించారు. మ‌హాకుంభ్ ప్రాంతంలోకి వాహ‌నాల ఎంట్రీని నిషేదించారు. వీవీఐపీ పాసుల‌ను ర‌ద్దు చేశారు. వెహికిల్ ఎంట్రీ కోసం ఇచ్చే ప్రత్యేక పాసుల‌కు కూడా అనుమ‌తి లేదు. అన్ని మిన‌హాయింపుల్ని ర‌ద్దు చేశారు. వ‌న్‌వే రూట్లను అమ‌లు చేస్తున్నారు. భ‌క్తులు సులువుగా న‌డిచేందుకు వ‌న్‌వే ట్రాఫిక్ సిస్టమ్‌ను అమ‌లు చేస్తున్నారు.

ప్రయాగ్‌రాజ్ స‌మీప జిల్లాల నుంచి వ‌స్తున్న వాహ‌నాల‌ను ఆ జిల్లా స‌రిహ‌ద్దుల‌కే ప‌రిమితం చేయ‌నున్నారు. డిస్ట్రిక్ బోర్డర్ల వ‌ద్ద వాహ‌నాల‌ను నిలిపివేస్తున్నారు. ర‌ద్దీని త‌గ్గించే ఉద్దేశంతో ఈ చ‌ర్యలు చేప‌డుతున్నారు. ఫిబ్రవ‌రి 4వ తేదీ వ‌ర‌కు చాలా క‌ఠిన నిబంధ‌న‌లు పాటించ‌నున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోకి ఫోర్ వీల‌ర్ వాహ‌నాల ఎంట్రీని నిలిపివేశారు.

(The above story first appeared on LatestLY on Jan 30, 2025 05:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).