Newdelhi, Oct 28: కర్ణాటకలో (Karnataka) ఓ భారీ ఉడుము (Komodo Dragon) ప్రత్యక్షమైంది. కొడగు జిల్లా పొన్నంపేట్ తాలుకాలోని కుందా గ్రామానికి చెందిన దిలీప్ (Dileep) అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఈ భారీ ఉడుము కనిపించింది. ఈ ఉడుముకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతరించిపోతున్న జీవ జాతికి చెందిన ఈ ఉడుము ఆరడుగుల పొడవు ఉంది. ఈ రోజుల్లో ఇంత భారీ ఉడుము కనిపించడం అత్యంత అరుదు.‘నా ఇంటి ఆవరణలో అకస్మాత్తుగా ఓ ఉడుము కనిపించింది. దాని పరిమాణం చూడగానే ఒక్కసారిగా భయం వేసింది. దాదాపు ఆరడుగుల పొడవుతో ఆ ఉడుము ఉన్నది. వెంటనే అటవీ అధికారులు సమాచారం ఇచ్చాను. వాళ్లు వచ్చి ఉడుమును బంధించి తీసుకెళ్లారు’ అని దిలీప్ తెలిపారు. అటవీ అధికారులు ఈ ఉడుము పొడవును కొలవగా 6 అడుగులు ఉన్నది.
కొమొడో డ్రాగన్ విశేషాలు ఇవే
కొమొడో డ్రాగన్ లు సాధారణంగా మూడు మీటర్లు లేదా 9.8 అడుగుల పొడవు ఉంటాయని, బరువు కూడా 90 నుంచి 136 కిలోల వరకు తూగుతాయని అటవీ అధికారులు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద బల్లి జాతి జీవులు అయిన ఈ కొమొడో డ్రాగన్ లు ఎక్కువగా ఇండోనేషియా దీవుల్లో కనిపిస్తాయని చెప్పారు. ఇండోనేషియాలోని కొమొడో, రిన్‌కా, ఫ్లోర్స్, గిలీ మొతాంగ్ దీవుల్లో ఈ కొమొడో డ్రాగన్‌ల సంచారం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ ఉడుములు వేట కోసం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పరుగెత్త గలవని అటవీ అధికారులు వెల్లడించారు. బల్లులు, కీటకాలు, పక్షులు, పాములను ఈ కొమొడో డ్రాగన్ ఆహారంగా తీసుకుంటాయని చెప్పారు.