Chennai, OCT 27: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. శుక్రవారం చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో వికెట్ తేడాతో విజయం (South Africa Win) సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. మార్‌క్రమ్ (91; 93 బంతుల్లో 7 ఫోర్లు, 3సిక్సర్లు) రాణించడంతో 271 లక్ష్యాన్ని సౌతాఫ్రికా (South Africa) 47.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. డేవిడ్ మిల్లర్ (29), బవుమా (28), క్వింటన్ డికాక్ (24), డస్సెన్ (21) లు తలా ఓ చేయి వేశారు. పాకిస్థాన్ బౌలర్లలో షహీన్ అఫ్రీది మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ వసీం జూనియర్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో (SA Vs PAK) పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు అలౌటైంది. సౌద్ షకీల్ (52; 52 బంతుల్లో 7 ఫోర్లు), కెప్టెన్ బాబర్ ఆజాం (50; 65 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. షాదాబ్ ఖాన్ (43) ఫర్వాలేదనిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంసీ నాలుగు వికెట్లు తీశాడు. మార్కో జాన్సన్ మూడు, గెరాల్డ్ కొయిట్జీ రెండు, లుంగి ఎంగిడి ఓ వికెట్ పడగొట్టాడు.
South Africa beat Pakistan by one wicket in the #ICCCricketWorldCup match, in Chennai pic.twitter.com/7eVioOSXOH
— ANI (@ANI) October 27, 2023
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (9), ఇమామ్ అల్ హక్ (12) లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో 38 పరుగులకే పాకిస్థాన్ రెండు వికెట్లు కోల్పోయింది. వీరిద్దరిని కూడా జాన్సెన్ ఔట్ చేశాడు. ఈ దశలో సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ బాబర్ ఆజాం, మహ్మద్ రిజ్వాన్ (31) లు ఇద్దరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరి మధ్య 48 పరుగుల భాగస్వామ్యం నెలకొన్న తరుణంలో జట్టు స్కోరు 86 పరుగుల వద్ద రిజ్వాన్‌ను కొయిట్జీ ఔట్ చేశాడు. ఇఫ్తికార్ అహ్మద్ (21), బాబర్ ఇద్దరూ కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో పాకిస్థాన్ 141 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. షాదాబ్ ఖాన్, సౌద్ షకీల్ లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షాదాబ్ సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగగా సౌద్ నిలకడగా ఆడాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరు కీలక సమయంలో ఔట్ అయ్యారు. ఆఖర్లో మహ్మద్ నవాజ్ (24) రాణించడంతో పాక్ 270 పరుగులు చేయగలిగింది.