
Beijing, March 08: చైనాలో ఓ సరికొత్త ఆన్‌లైన్ ట్రెండ్ (New Trend) ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ప్రధాన బ్యాంకుల ఆవరణలోని మట్టిని (Soil) సేకరించి దాన్ని అమ్ముతున్నారు. ఆ మట్టి ఉంటే అదృష్టం, ఆర్థికంగా కలిసివస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ఈ ‘బ్యాంక్ మట్టి’ (Bank Soil) ధర సుమారు రూ.250 నుంచి రూ.10,200 మధ్య వరకు ఉంది. ఈ మట్టిని ఇంట్లో ఉంచుకుంటే ఆర్థికంగా లాభాలు పొందవచ్చని చాలా మంది నమ్ముతున్నారు. బ్యాంకుల ముందు మట్టిని తవ్వుతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. బ్యాంక్ లాబీల లోపల మొక్కల్లో వద్ద ఉండే మట్టిని, కౌంటింగ్ మిషన్ నుంచి వచ్చిన ధూళిని కూడా అమ్మకందారులు ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు.
కొంత మంది వ్యాపారులైతే ఈ మట్టిని కొందరి నుంచి కొనుగోలు చేసి, తమ బిజినెస్ అభివృద్ధి కోసం వాడుతున్నామని చెబుతున్నారు. అయితే, ఇటువంటివి నమ్మకూడదని కూడా కొందరు అవగాహన కల్పిస్తున్నారు.
పబ్లిక్ ప్రదేశాల్లో మట్టి తవ్వడం చట్ట విరుద్ధమని న్యాయనిపుణులు అంటున్నారు. మట్టి అమ్ముతున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. “ఈ మట్టి ఐదు ప్రధాన బ్యాంకుల వద్ద నుంచి చేతితో సేకరించాం. ఈ మట్టిని ఇంట్లో పెట్టుకుంటూ చెడు శక్తులను తొలగిస్తుందని కొందరు నమ్ముతారు. ఆర్థికంగానూ ప్రయోజనాలు కలుగుతాయి.
కానీ మేము దీన్ని శాస్త్రీయంగా రుజువు చేయలేము” అని అన్నారు. ఈ మట్టి సేకరణ రాత్రివేళలో, వివిధ బ్యాంకుల వద్ద జరుగుతుందని విక్రయదారులు చెబుతున్నారు. వ్యాపారంలో లాభాలు వస్తాయని కొందరు వ్యాపారస్తులు ఈ మట్టిని కొనుగోలు చేస్తున్నారు.
ఓ వ్యాపారి మాట్లాడుతూ “నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ మట్టిని కొనుగోలు చేశాను. నా స్నేహితులు కూడా ఇదే చేశారు” అని అన్నారు. అసలు మట్టిని అమ్ముతున్నవారు దాన్ని నిజంగా బ్యాంకుల వద్ద నుంచే తీసుకొస్తున్నారా? అన్న విషయంలోనూ స్పష్టత లేదు. చైనా చట్టాల ప్రకారం పబ్లిక్ ప్రదేశాల్లో మట్టిని తవ్వడం నిషిద్ధం.