
Washington, March 06: దేశీయంగా ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల విధింపుతో దూకుడుగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. పలు దేశాల నుంచి వచ్చే వారిపైనా నిషేధం విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్‌లపై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకోనుందని, వచ్చే వారమే ఇది అమల్లోకి రానున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించారు. అనేక పరిశీలన అనంతరం 2018లో అక్కడి సుప్రీం కోర్టు (Supreme Court) కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ సర్కార్ (Joe Biden).. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది.
అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో అమెరికాలోకి ప్రవేశించే విదేశీయులను నుంచి జాతీయ భద్రతా ముప్పు పొంచి వుందా అన్న విషయాన్ని ముందే గుర్తించే కార్యనిర్వాహక ఆదేశంపైనా సంతకం చేశారు. దీని ప్రకారం, పాక్షికంగా లేదా పూర్తిగా ప్రయాణ నిషేధం విధించాల్సిన దేశాల జాబితాను రూపొందించి మార్చి 12లోగా సమర్పించాలని కేబినెట్ సభ్యులను ఆదేశించారు. ఇందులో భాగంగా పూర్తిగా నిషేధం కోసం సిఫార్సు చేసిన జాబితాలో అఫ్గానిస్థాన్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో పాకిస్థాన్‌ను కూడా చేర్చనున్నట్లు సమాచారం.
అఫ్గాన్‌లో దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉన్న అమెరికా సేనల కోసం పని చేసిన స్థానికులపై తాలిబన్లు ప్రతీకారం తీర్చుకోనున్నారనే భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో వేలాది మంది అఫ్గాన్ పౌరులు అమెరికాలో శరణార్థులు లేదా ప్రత్యేక వలసవాదుల కింద వీసా పొందారు. ఒకవేళ నిషేధం అమల్లోకి వస్తే వీరందరిపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది.