Amaravati, Dec 28: యూకేలో పుట్టిన కొత్త కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. తాజాగా ఏపీకి కూడా (New Covid Strain in AP) పాకింది. యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు వచ్చిన వారి సంఖ్య 1363కి చేరింది. యూకే నుంచి ఏపీ వచ్చిన వారు.. వారి కాంటాక్ట్స్‌లో 23 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఇప్పటివరకు 1,346 మందిని అధికారులు ట్రేస్ చేయగా, మరో 17 మంది కోసం ట్రేసింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. యూకే నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 11 మందికి కరోనా నిర్థారణ అయ్యింది.
అనంతపురం, నెల్లూరులో ఒక్కొక్కరు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ముగ్గురు, గుంటూరులో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. యూకే నుంచి ఏపీ వచ్చిన వారి కాంటాక్ట్స్‌లో 5,784 మందికి పరీక్షలు నిర్వహించారు. యూకే రిటర్న్స్‌తో కాంటాక్ట్ అయిన 12 మందికి పాజిటివ్‌గా గుర్తించారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఎనిమిది మందికి పాజిటివ్ కాగా, తూ.గో.జిల్లాలో ముగ్గురికి, నెల్లూరులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిం
ఇక తెలంగాణలో కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ (New Covid Strain in TS) కలకలం సృష్టిస్తోంది. యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా... ఈ పరీక్షల్లో 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. అయితే వీరిలో ఎంతమందికి కరోనా స్ట్రెయిన్ (UK COVID-19 strain) ఉందనేది సస్పెన్స్‌గా ఉంది. 20మంది శాంపిల్స్ జీన్ మ్యాప్ రిపోర్టులను సీసీఎంబీ కేంద్రానికి పంపింది. అలాగే తెలంగాణ అధికారులకు సమాచారం అందించింది.
కరోనా స్ట్రెయిన్‌పై అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి రిపోర్టులు చేరుతున్నాయి. కొత్త స్ట్రెయిన్ గురించి వైద్యాధికారులు ఎవరూ మాట్లాడొద్దని కేంద్రం ఆదేశాలిచ్చింది. రేపు సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయనుంది. కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ వచ్చినా టెన్షన్ పడొద్దని వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే యూకే నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో 154 మంది జాడ ఇప్పటికీ చిక్కడంలేదు. ఈ నెల 9 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,216 మంది బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చారు. ఇందులో చాలా మంది ఆచూకీ లభించగా, ఇంకా 154 మంది జాడ తెలియడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నది.
యూకే నుంచి వచ్చినవారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నది. ఇప్పటివరకు 970 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో శుక్రవారం 16 మందికి, శనివారం ఇద్దరికి, ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. దీంతో వీరి సంఖ్య 20కి చేరింది.
యూకే నుంచి వచ్చినవారిలో 92 మంది ఇతర రాష్ట్రాల వారు కాగా, ఆ వివరాలను ఆయా ప్రభుత్వాలకు చేరవేశారు. మిగిలిన 154 మంది జాడను పాస్‌పోర్టు ఆధారంగా గుర్తించడం అధికారులకు సవాల్‌గా మారింది. పేర్కొన్న అడ్రస్, ఫోన్ నంబర్లు పాతవి కావడంతో వారిని వెతకడం సాధ్యం కావడం లేదు. యూకే నుంచి వచ్చినవారు లేదా యూకే మీదుగా ప్రయాణించి తెలంగాణకు చేరుకున్నవారు 040–24651119 నంబర్‌లో సంప్రదించాలని, 9154170960 నంబర్‌కు వాట్సాప్ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.