New Delhi, Dec 27: గతేడాది బయటకు వచ్చిన కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉండగానే యూకేలో పుట్టిన కొత్త కరోనావైరస్ (Coronavirus 2.0 Symptoms) చుక్కలు చూపిస్తోంది. జన్యు మార్పులతో కొత్త రూపును సంతరించుకున్న ఈ కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు మెల్లిగి విస్తరిస్తోంది. తాజాగా ఇండియాలో కూడా కొత్త కరోనావైరస్ కేసులు (new Covid strain) నమోదయ్యాయి.. అయితే ఈ కొత్త కరోనావైరస్ ని ఎలా గుర్తించాలినే దానికి బ్రిటన్ అత్యున్నత వైద్య సంస్థ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్) కొన్ని లక్షణాలను (New Coronavirus variation symptoms) వెల్లడించింది. అవేంటో ఓ సారి చూద్దాం.
బ్రిటన్ అత్యున్నత వైద్య సంస్థ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం... ఇప్పటిదాకా జ్వరం, దగ్గు, వాసన పసిగట్టలేకపోవడం, రుచి తెలుసుకోలేకపోవడం వంటివి మాత్రమే కొవిడ్ లక్షణాలని అందరికీ తెలుసు. ఇప్పుడు వాటికి జత కలిసిన కొత్త స్ట్రెయిన్ లక్షణాలును చేర్చింది.
అలసట
ఆకలి లేకపోవడం
విపరీతమైన తలనొప్పి
విరేచనాలు
గందరగోళంగా అనిపించడం
కండరాల నొప్పులు
జ్వరం, దగ్గు, వాసన పసిగట్టలేకపోవడం ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చెయ్యకుండా వెంటనే టెస్టు చేయించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో బ్రిటన్ నుంచి వచ్చే.. అక్కడకు వెళ్లే విమానాలన్నింటినీ చాలా దేశాలు రద్దు చేశాయి. దాని ప్రభావంతో చాలా ప్రాంతాల్లో పాక్షికంగా లాక్ డౌన్లు పెట్టేస్తున్నారు. ఇండియాలోనూ కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని సిటీల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం ఈ రకం కరోనాను గుర్తించడానికి నిర్దిష్టమైన టెస్టుల్లేవు. ఆర్టీపీసీఆర్ టెస్టులే చేసి.. పాజిటివ్ వస్తే దాని జన్యు క్రమాన్ని తేల్చే పనిలో నిపుణులు, శాస్త్రవేత్తలు పడ్డారు.
ఇదిలా ఉంటే బ్రిటన్‌లో కొత్త రూపం సంతరించుకున్న వైరస్ ప్రస్తుతం చేసే కరోనా పరీక్షల్లో బయటపడకపోవచ్చని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ఈ–సీడీసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం వైరస్‌పై నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం వాడుతున్న ఎస్–జీన్ (స్పైక్ జీన్) ఆధారిత ఆర్‌టీపీసీఆర్ టెస్టుల స్థానంలో అన్ని రకాల జీన్‌లు, మార్పులతో తయారైన కిట్లు తయారుచేయాలి. లేకుంటే ఈ వైరస్‌ను పూర్తిగా కనిపెట్టలేం.. ఆర్‌టీపీసీఆర్ టెస్టుల్లో దీన్ని గుర్తించడం తక్కువ.. అందువల్ల పరీక్షల్లో మార్పులు చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం స్పైక్–జీన్‌లో మార్పులను బట్టి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు జరగడం లేదని తెలిపింది.
యూకేలో పెరిగిన కేసుల్లో జన్యు విశ్లేషణ ఆధారంగా కొత్త వర్గానికి చెందిన కరోనా బయటపడింది. ప్రపంచంలో 10 రకాల కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లున్నాయి. అందులో కోవిడ్ ఒకటి. కోవిడ్‌లో 11 రకాల ఉప గ్రూప్‌లున్నాయి. ప్రస్తుతం ప్రపం చాన్ని వణికిస్తున్న కోవిడ్–19 వైరస్‌లో ఏ2ఏ అనే వర్గపు వైరస్ ప్రధానమైంది. మన దేశంలోనూ అదే ఉంది. ఇప్పుడు యూకేలో వచ్చింది కోవిడ్–19లో బీ వర్గానికి చెందినది.
ఇది అనూహ్యంగా జన్యు మార్పులు చెంది 29 రకాలుగా మార్పులు చెందింది. సౌత్ ఈస్ట్ ఇంగ్లండ్‌లో వారం పది రోజుల్లో నమోదైన వెయ్యి కేసుల్లో సగం ఈ వర్గానికి చెందినవే.. గతంలో 5% ఉన్నది కాస్తా ఇప్పుడు 50% పెరిగింది. మిగిలిన కరోనా వైరస్‌ల కంటే ఇది 70% వేగంగా విస్తరిస్తుంది. అయితే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో గుర్తించలేదని ఈ–సీడీసీ తెలిపింది. ఇక ఈ వైరస్‌కు గురైన వారి సగటు వయసు 47 ఏళ్లు.. అంటే 60 ఏళ్లలోపు వారికే ఎక్కువగా ఈ వైరస్‌తో ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.