Amaravati, July 24: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,820 పరీక్షలు నిర్వహించగా.. 2,174 కేసులు (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో19,49,618 మంది వైరస్ (Coronavirus) బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 2,737 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,14,019 కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,358 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,40, 50, 103 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
తాజాగా కరోనాతో చికిత్స పొందుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ 18 మంది మృతి చెందారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 5 గురు మృతి చెందగా, చిత్తూరులో నలుగురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,241కి చేరింది.
Here's AP Covid Report
#COVIDUpdates: As on 24th July 2021 10:00 AM
COVID Positives: 19,49,618
Discharged: 19,14,019
Deceased: 13,241
Active Cases: 22,358#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ZrT149pmf6
— ArogyaAndhra (@ArogyaAndhra) July 24, 2021
కోవిడ్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సమర్థవంతంగా ఉన్నాయి : గవర్నర్
కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు.
రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు మొక్కవోని ధైర్యంతో వ్యవహరించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించారని ఆయన ప్రశంసించారు. వైద్యులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, రెడ్‌క్రాస్ ఇతర స్వచ్ఛంద సంస్థలు రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో సమర్థవంతమైన సేవలందించారన్నారు.
గత రెండేళ్లలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా ప్రజలతో మమేకమయ్యే అవకాశం తనకు లభించిందన్నారు. సేంద్రియ వ్యవసాయం, మొక్కల పెంపకం, రక్తదాన శిబిరాలు మొదలైన ప్రజోపయోగ కార్యక్రమాల్లో తనకు పాల్గొనే అవకాశం లభించిందని చెప్పారు.
ఏపీ రెడ్ క్రాస్ సొసైటీ ఒకేరోజు అత్యధిక సంఖ్యలో వలంటీర్ల ద్వారా రక్తదాన శిబిరాలను నిర్వహించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పడం గొప్ప ఘనతగా పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా తీసుకొచ్చిన సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసి దేశానికి మార్గదర్శిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.