 
                                                                 Gannavaram, June 13: కృష్ణా జిల్లా గన్నవరం పట్టణంలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.గన్నవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గన్నవరం పట్టణంలోని సినిమాహాళ్ల కూడలి సమీపంలో నివసిస్తున్న మొహమ్మద్ జాస్మిన్(20) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన ఎస్.కె.జబీబుల్లా 27ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే అతడికి ఇంతకు ముందే పెళ్లయ్యింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. అతడిని పలుమార్లు హెచ్చరించారు. ఇటీవల ఇల్లు మారిన జబీబుల్లా గత రెండ్రోజులుగా జాస్మిన్ ఫోన్ ఎత్తకపోవడంతో విద్యార్థిని మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు.. హుటాహుటిన చిన్నఅవుటపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది.
చేతికందివచ్చిన కుమార్తె మృతికి జబీబుల్లా కారణమంటూ కుటుంబ సభ్యులతో కలిసి బంధువులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. తమ కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జబీబుల్లాపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, అతడిని అదుపులోకి తీసుకున్నామని సీఐ కనకారావు తెలిపారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
