Telangana Assembly Election 2023: ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం, తెలంగాణలో 20 మంది అధికారులపై వేటు, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని ఆదేశాలు
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం బదిలీలకు తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు పోలీస్ కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలకు స్థాన చలనం కలిగించింది. రవాణా శాఖ కార్యదర్శి, ఎక్సైజ్ డైరెక్టర్, వాణిజ్య పన్నుల కమిషనర్‌నూ ఈసీ పక్కన పెట్టేసింది.
Hyd, Oct 12: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం బదిలీలకు తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు పోలీస్ కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలకు స్థాన చలనం కలిగించింది. రవాణా శాఖ కార్యదర్శి, ఎక్సైజ్ డైరెక్టర్, వాణిజ్య పన్నుల కమిషనర్‌నూ ఈసీ పక్కన పెట్టేసింది.
మొత్తం తెలంగాణలో ఎన్నికల (Telangana Assembly Elections 2023) వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న 20 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) వేటు వేసింది. వారిలో నలుగురు కలెక్టర్లు, హైదరాబాద్ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, ఆబ్కారీశాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్, రవాణాశాఖ కార్యదర్శి ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని స్పష్టం చేసింది.
ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో పనితీరు సంతృప్తికరంగా లేకపోవటంతోనే ఆయా అధికారులను విధుల నుంచి తప్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి నాలుగు లేఖలను ఈసీ బుధవారం పంపించింది. షెడ్యూలు విడుదలకు సుమారు నెల రోజుల ముందు నుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగాలను కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దింపింది.
వీడియో ఇదిగో, కియా కారులో 3.35 కోట్ల రూపాయలను పట్టుకున్న పోలీసులు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఘటన
రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు ఈ నెల 3 నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, వివిధ విభాగాల అధికారులతో విస్తృత సమీక్షలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి తీసుకున్న చర్యలపై ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. వివిధ స్థాయుల్లో అధికారుల బదిలీలపైనా అసహనం వ్యక్తం చేశారు. 2018 ఎన్నికలు, ఆ తరవాత జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసినా అడ్డుకట్ట వేయకపోవడం ఆందోళన కలిగిస్తోందని మండిపడ్డారు.
అక్రమంగా తరలిస్తున్న సొమ్మును పెద్దగా స్వాధీనం చేసుకోకపోవడాన్నీ ప్రస్తావించారు. ‘మీరు చెప్పే వివరాలపైనే మేం ఆధారపడటం లేదు. మా నివేదికలు మాకు ఉన్నాయి’ అంటూ పలు కీలక అంశాలపై అధికారులను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, ఉచితాలు ఎక్కడికి వెళ్లాల్సినవి అక్కడికి వెళ్తోంటే ఏం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. స్వాధీనాలకు సంబంధించి ఒకదశలో అధికారులు తెలిపిన గణాంకాల విషయంలో అసహనం వ్యక్తం చేయటం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది.
రాష్ట్రంలోని అధికారులను తప్పించిన నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటల్లోగా ప్రత్యామ్నాయ అధికారుల జాబితాను పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఒక్కో అధికారి పోస్టును భర్తీ చేసేందుకు ముగ్గురేసి అధికారులతో జాబితా (ప్యానల్) రూపొందించి పంపించాలని స్పష్టం చేసింది.
స్థాన చలనం కలిగిన వారిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్. హరీశ్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ డి. అమోయ్ కుమార్, యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్‌రెడ్డి ఉన్నారు. వీరితో పాటూ 10 జిల్లాల ఎస్పీలను కూడా బదిలీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది.
వీరిలో సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, మహబూబాబాద్-చంద్రమోహన్, భూపాలపల్లి-కరుణాకర్, మహబూబ్‌నగర్-నర్సింహ, నారాయణపేట-వెంకటేశ్వర్లు, సంగారెడ్డి- రమణకుమార్, కామారెడ్డి- శ్రీనివాస్ రెడ్డి, నాగర్‌కర్నూల్-మనోహర్, జగిత్యాల-భాస్కర్, గద్వాల్-సృజన ఉన్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల కమిషనర్, ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్-ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ, రవాణా శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజులను కూడా బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది.
అంతేకాకుండా, వాణిజ్య పన్నుల శాఖకు, ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా ముఖ్య కార్యదర్శులను నియమించాలని కూడా పేర్కొంది. తెలంగాణతో పాటూ ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఈసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
(The above story first appeared on LatestLY on Oct 12, 2023 10:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

