CM KCR Review: తెలంగాణలో కొవిడ్19 పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష, హైకోర్ట్ వ్యాఖ్యలను సీఎం దృష్టికి తెచ్చిన అధికారులు, కోర్ట్ ఏది అడిగినా పూర్తి వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసిన సీఎం

కరోనా విషయంలో ఎవరు పడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హైకోర్టు ఇప్పటివరకు 87 పిల్స్ ను స్వీకరించింది. నిత్యం కోర్టు విచారణల వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతుంది. కరోనా సోకిన వారికి వైద్యం అందించే విషయంలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న వైద్యాధికారులు...

CM KCR Review: తెలంగాణలో కొవిడ్19 పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష, హైకోర్ట్ వ్యాఖ్యలను సీఎం దృష్టికి తెచ్చిన అధికారులు, కోర్ట్ ఏది అడిగినా పూర్తి వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసిన సీఎం
CM KCR & Health Minister Etala Rajender | File Photo

Hyderabad, July 21:  తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్, సీఎస్ సోమేశ్ కుమార్ సహా వైద్య శాఖకు సంబంధించి ముఖ్య అధికారులందరూ ఈ సమావేశంలో పాల్గొని అన్ని విషయాలను సీఎంతో పంచుకున్నారు.

సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి హైకోర్టులో దాఖలవుతున్న పిల్స్, వాటిపై విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవడంలోనూ, పరీక్షలు-చికిత్స విషయంలోనూ ప్రభుత్వం, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందనే దానిపై అధికారులు సీఎంకు వివరించారు.

‘‘కరోనా విషయంలో ఎవరు పడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హైకోర్టు ఇప్పటివరకు 87 పిల్స్ ను స్వీకరించింది. నిత్యం కోర్టు విచారణల వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతుంది. కరోనా సోకిన వారికి వైద్యం అందించే విషయంలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర సీనియర్ అధికారులు కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. ఈ క్లిష్ట సమయంలో చేయాల్సిన పనులను వదిలి పెట్టి కోర్టు చుట్టూ తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సమయం అంతా సరిపోతున్నది. దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాం.

వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. మరణాల సంఖ్య తక్కువగా ఉంది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, వైద్య శాఖ, వైద్యాధికారులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఎంత మందికైనా సరే వైద్యం అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రతీ రోజు వేల సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంత చేస్తునప్పటికీ హైకోర్టు వ్యాఖ్యలు చేయడం బాధాకరంగా ఉంది. గతంలో కూడా మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని ఎవరో పిల్స్ దాఖలు చేశారు. దానికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాస్తవ పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని అదే తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినప్పటికీ హైకోర్టులో పిల్స్ దాఖలు అవుతూనే ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే అభిప్రాయం కలిగించేలా వార్తలు రాస్తున్నాయి. ఇది ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యం దెబ్బతీయడమే’’ అని సమావేశంలో పాల్గొన్న పలువురు సీఎం వద్ద తమ నిరసన, ఆవేదన వ్యక్తం చేశారు.

అందరి అభిప్రాయాలను ఓపికగా విన్న సీఎం, హైకోర్టు అడిగిన ప్రతీ వివరాన్నీ, చేస్తున్న పనిని కోర్టుకు తెలియజేయాలని సూచించారు.

వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించే విషయంలో, వైద్యం అందిస్తున్న విషయంలో, తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో పూర్తి వాస్తవాలను హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా కోర్టుకు కావాల్సిన ఖచ్చితమైన సమాచారాన్ని వైద్యాధికారులు అందించాలని సూచించారు.

 

(The above story first appeared on LatestLY on Jul 21, 2020 09:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).