CM Revanth Reddy Press Meet on Water Tussle (Photo-Video Grab)

Hyd, Feb 4: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదులో కృష్ణా, గోదావరి జలాలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు.మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..కేటీఆర్‌, హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయాలని విభజన చట్టంలోనే ఉందన్నారు.

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై వివరణ ఇచ్చారు.కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసే అంశంలో కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ లదే తప్పు అని విమర్శించారు. ఈ ముగ్గురు తాము చేసిన పాపాలు కప్పి పుచ్చి, ఆ పాపాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వంపైకి నెట్టివేసి, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ అంతిమంగా రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ పార్లమెంట్ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు 300కు పైగా అప్లికేష‌న్లు, ఖ‌మ్మం స్థానానికి భారీగా డిమాండ్, రిజ‌ర్వేష‌న్ స్థానాల్లోనూ పెద్ద ఎత్తున ఆశావాహులు

కొన్నిరోజుల కిందట హైదరాబాదులో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం నిర్వహించగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలు, ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు కేఆర్ఎంబీకి అప్పగించాలని ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు అంగీకరించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి చెందిన రివర్ మేనేజ్ మెంట్ బోర్డులకు స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్-84, 85, 86, 87, 88, 89లతో స్పష్టంగా పేర్కొన్నారని రేవంత్ రెడ్డి వివరించారు.

ఈ పునర్ విభజన చట్టాన్ని తానే రాయించానని కేసీఆర్ (CM Revanth Reddy Slams KCR) చెబుతున్నాడు కాబట్టి, ఇప్పుడు ఆయననే సూటిగా ప్రశ్నిస్తున్నాం... 2014లో కేసీఆర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంటులో పునర్ విభజన చట్టం ఆమోదం పొందింది. ఈ చట్టానికి మీరే రచయిత అయినప్పుడు... మీరే కథ, కథనం నిర్వహించినప్పుడు... కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?

Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌, పార్టీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, కాంగ్రెస్‌లో చేరుతారని ఊహాగానాలు 

మీరు 2014లో ఎంపీగా ఉన్నప్పుడే ప్రాజెక్టుల అప్పగింతకు పునాదిరాయి పడింది. మీ అనుమతి మేరకు, మీ సూచన మేరకే నాటి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. లోక్ సభలో, రాజ్యసభలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు మీరు కూడా ఈ చట్టానికి ఓట్లు వేసి ఆమోదించారు. ఇవాళ ఈ ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుంది అంటే అందుకు బాధ్యులు కేసీఆర్, కేశవరావు. కేసీఆర్ నాడు లోక్ సభలో ఉన్నారు, కేశవరావు రాజ్యసభలో ఉన్నారు.

కృష్ణా నదీ ప్రాజెక్టుల ద్వారా అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రైబ్యునల్ కేటాయించింది 811 టీఎంసీలు. అయితే, రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని పంపకాలు చేశారు. మరి ఇప్పుడు కృష్ణా నది నీటిలో సగం వాటా కావాలంటున్నవారు అప్పుడెందుకు అడగలేదు?

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68 శాతం, ఏపీలో 32 శాతం ఉంది. ఏ ప్రాంతంలో ఎక్కువ నదీ పరీవాహక ప్రాంతం ఉంటుందో, అంత శాతం ఆ ప్రాంతానికి నీటి కేటాయింపులు ఉండాలని అంతర్జాతీయ విధివిధానాలు చెబుతున్నాయి. ఆ లెక్కన 500 పైచిలుకు టీఎంసీల నీరు తెలంగాణకు, 200 పైచిలుకు టీఎంసీల నీరు మాత్రమే ఏపీకి పోవాలి. కానీ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది.

తెలంగాణకు రావాల్సిన నీటి వాటా రాకుండా, ఆ హక్కులను ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే అది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. ఇప్పుడు తెలంగాణకు ఏదైనా నష్టం జరిగితే అందుకు బాధ్యులు కేసీఆర్, హరీశ్ రావు, ఈఎన్సీ మురళీధర్ రావు. నాడు కేఆర్ఎంబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వీళ్లు ఆమోదించడం ద్వారా తెలంగాణకు తీరని నష్టం కలుగజేశారు" అంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం జరిగింది. కృష్ణానదిలో 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలనే దానిపై కేంద్రం కమిటీ వేసింది. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించారు. దానికి అప్పటి సీఎం కేసీఆర్‌, అధికారులు అంగీకరించి సంతకాలు చేశారు.

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లు 2022లో సంతకాలు చేశారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ నిర్వహణకు 2023 బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించారు. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు ప్రాజెక్టులపై కేసీఆర్‌ పార్లమెంట్‌లో ప్రశ్నించలేదు. ఇప్పుడు కృష్ణాలో 50 శాతం నీటి వాటా కావాలని అడుగుతున్నారని మండిపడ్డారు.

వైఎస్‌ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారు. దీనికి కేసీఆర్‌, హరీశ్‌రావు సహకరించారు. దీని వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్‌ పార్టీ కొట్లాడింది. పీజేఆర్‌, మర్రి శశిధర్‌రెడ్డి పోరాటం చేశారని గుర్తు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశాడని తెలిపారు. 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలకు జీవో ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీశైలం నుంచి నీళ్లే కాదు, బురద కూడా ఎత్తిపోసుకునేలా జగన్ యత్నాలు ఉన్నాయని విమర్శించారు.

రోజుకు 8 టీఎంసీల నీరు తరలించుకుపోవాలన్నది జగన్ ప్రణాళిక అని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఏపీకి 8 టీఎంసీల నీరు తరలించడానికి కేసీఆర్ అనుమతించారని... ప్రగతిభవన్ లోనే జగన్, కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 5 మే 2022న ఈ మేరకు జీవో ఇచ్చారు. గతంలో చంద్రబాబు హయాంలో ముచ్చుమర్రి కట్టారు. 800 అడుగుల వద్ద నీటి తరలింపునకు ప్రయత్నించారు. దానికీ కేసీఆర్‌ సహకరించారు.

జగన్ తో చీకటి ఒప్పందం మేరకే కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదని, ఒప్పందం మేరకే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ వ్యతిరేకించలేదని ఆరోపించారు. రాయలసీమ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ సహకరించారని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలోనే రెండు ప్రాజెక్టులు మొదలయ్యాయని... కేసీఆర్ పదవులు, కమీషన్లకు లొంగి జలదోపిడీకి సహకరించారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గతంలో కృష్ణానది ప్రాజెక్టులపై ఆధిపత్యం తెలంగాణ చేతిలో ఉండేది. కానీ, వైఎస్‌, చంద్రబాబు, జగన్‌ ఒత్తిళ్లకు కేసీఆర్‌ లొంగిపోయారు. పదవులు, కమీషన్లకు లొంగి జలదోపిడీకి సహకరించారు. ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే పది లక్షల ఎకరాలకు నీరు అందేది. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి కంటే ఎక్కువ నిర్లక్ష్యం కేసీఆర్‌ హయాంలోనే జరిగింది. ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోకుండా కేసీఆర్‌ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని మండిపడ్డారు.

కేఆర్‌ఎంబీ మీటింగ్‌ మినిట్స్‌ తప్పుగా రాశారు. దీనిపై జనవరి 27న మన అధికారులు కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణ నీటి హక్కుల కోసం మేం కొట్లాడుతున్నాం. కేసీఆర్‌ జనంలోకి వచ్చేందుకు మొహం చెల్లక మాయమాటలు చెబుతున్నారు. నాగార్జున సాగర్‌ డ్యామ్‌ను జగన్‌ ఆక్రమిస్తే కేసీఆర్‌ స్పందించలేదు. ప్రాజెక్టులపై శాసనసభ ఉమ్మడి సమావేశాలు నిర్వహిద్దాం. సాగునీటి ప్రాజెక్టులపై రెండు రోజులు ప్రత్యేకంగా చర్చిద్దాం. ప్రాజెక్టులపై కేసీఆర్‌ ఎంతసేపైనా మాట్లాడొచ్చు.. మేం అడ్డురాం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం’’అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘ప్రాజెక్టుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ సర్వనాశనం చేశారు. దీనిపై ఆయనకు మాట్లాడే హక్కే లేదు. జగన్‌, కేసీఆర్‌ ఏకాంత చర్చల్లో ఏం కుట్ర చేశారో? ఎత్తిపోతల ద్వారా జగన్‌ రోజుకు 8 టీఎంసీల నీటిని తీసుకెళ్తుంటే.. కేసీఆర్‌ కేవలం 2 టీఎంసీల కోసం రూ. లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించే ప్రయత్నం చేశారు’’అని విమర్శించారు.